India West Indies Match Report : దాదాపు నెల రోజులపాటు భారత్.. వెస్టిండీస్ పర్యటనలో గడిపేసింది. కొన్నింట్లో ఫలితాలు సానుకూలంగా రాగా.. మరికొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సిన పరిస్థితులు కూడా తెలుసుకునేందుకు దోహదపడింది. భారత్ టెస్టు, వన్డే సిరీస్‌లను గెలిచినప్పటికీ.. విండీస్ బలహీనంగా ఉండటం వల్ల పెద్దగా పోటీ ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వెల్లడైంది. టీ20ల్లో వారి ఆటతీరుతో మెరుగుపరచుకుని సిరీస్‌ను సొంతం చేసుకున్నారు విండీస్ ఆటగాళ్లు.
రోహిత్ కెప్టెన్సీలో విండీస్‌లో అడుగు పెట్టిన భారత జట్టు.. తొలుత రెండు టెస్టుల సిరీస్‌లో తలపడింది. మొదటి టెస్టులో విజయాన్ని అందుకున్న భారత్.. రెండో టెస్టులోనూ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ వర్షం కారణంగా డ్రాతో ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో భారత్.. రెండుటెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఆ తర్వాతి వన్డేల్లో రోహిత్, విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి.. కేవలం యువకులతోనే బరిలోకి దిగింది జట్టు. ఈ సిరీస్‌లో కాస్త తప్పటడుగు పడినట్లు అనిపించినా దాన్ని కూడా భారత్ సొంతం చేసుకుంది.
ఇక టీ20 సిరీస్‌లో డేంజరస్ బ్యాటర్లతో బరిలోకి దిగిన విండీస్‌ను తట్టుకోవడం.. భారత్‌కు కాస్త ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. దీంతో పొట్టి సిరీస్‌ను విండీస్‌కే సమర్పించుకోవాల్సి వచ్చింది. పూరన్, రోవ్‌మన్ పావెల్, బ్రాండన్ కింగ్, షైహోప్ వంటి హిట్టర్లను భారత్ అడ్డుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా పూరన్ ఈసారి మరింత రెచ్చిపోయాడు. ఒక సిరీస్ చేజారి పోయినప్పటికీ ఈ పర్యటనలో చాలా అంశాలు భారత్‌కు కలిసొచ్చాయి. వీటితోపాటు మరికొన్ని సమస్యలు సైతం బయటకొచ్చాయి. 2024లో ఇక్కడే టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇలాంటప్పుడు మంచి సన్నాహకంగా మార్చుకోవాల్సిన తరుణంలో సిరీస్‌ను జారవిడుచుకోవడం అభిమానుల మదిలో సందేహాలు లేవనెత్తాయి.
యువకులు అదుర్స్..
Indian New Cricket Players Performance : వరర్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 తర్వాత ఆసియా కప్ 2023 మినీ టోర్నీకి ముందు భారత్ చేసిన పర్యటన ఇదే. దాదాపు నెల రోజులపాటు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లను భారత్ ఆడింది. విండీస్ పర్యటనతోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన యువ క్రికెటర్లైన.. యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్, తిలక్ వర్మ తమకొచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. జైస్వాల్ తొలి టెస్టులోనే భారీ శతకం చేశాడు. టీ20ల్లో కూడా హాఫ్ సెంచరీ బాదేశాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టి, విండీస్‌పై టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం ఇక్కడ విశేషం. తన తొలి హాఫ్ సెంచరీతోపాటు బౌలింగ్‌లోనూ మొదటి వికెట్ పడగొట్టాడు తిలక్. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన ఆటగాడిగా ముకేశ్ కుమార్ రికార్డు సృష్టించడం విశేషం. టెస్టు, వన్డేలు, టీ20ల్లోనూ ఇక ముకేశ్ కుమార్ వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్‌ను కాదని ముకేశ్‌కే అవకాశాలు దక్కాయంటే.. అతడి బౌలింగ్ ప్రదర్శన బాగుండటమే కారణంగా చెప్పవచ్చు. వన్డేల్లో బ్యాటర్లు ఇషాన్ కిషన్ (184 పరుగులు), శుభ్‌మన్ గిల్ (126 పరుగులు) చక్కటి ప్రదర్శన చేశారు. ఫామ్‌తో ఇబ్బంది పడిన సూర్యకుమార్ యాదవ్ (166 పరుగులు) ఎట్టకేలకు టీ20ల్లో తన సత్తా ఎంటో నిరూపించాడు.
వీరు విఫలమే!
Ind vs Wi Analysis : ఓ వైపు యువ క్రికెటర్లు అదరగొట్టేస్తుండగా.. కొందరు సీనియర్లు మాత్రం తమకు వచ్చిన అవకాశాలను నీరుగార్చుకున్నారు. సంజూ శాంసన్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు. ఇతడు వన్డేలు, టీ20ల్లో తన స్థాయి ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. ఒక్క వన్డేలో మినహా మిగతా అన్ని మ్యాచుల్లోనూ సంజూ శాంసన్ విఫలమయ్యాడు. ఆ వన్డేలోనూ 51 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఐదు టీ20ల్లో కేవలం 32 పరుగులు మాత్రమే శాంసన్ చేశాడు.
హార్దిక్ పాండ్య కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏమంత గొప్ప ప్రదర్శన ఇవ్వలేదనే చెప్పుకోవాలి. వన్డేల్లో మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క వికెట్ తీసి.. 82 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్య. ఐదు టీ20ల్లో 77 పరుగులు చేసి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్య కీలకంగా మారతాడని భావిస్తున్న వేళ అతడి ప్రదర్శన నిరాశాజనకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అదరగొట్టి టెస్టు వైస్ కెప్టెన్‌గా మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అజింక్య రహానె.. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అతడు ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 8 పరుగులు మాత్రమే చేశాడు.
హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు..
Indian Team Captain Hardik Pandya : వెస్టిండీస్ పర్యటనను ప్రయోగాలకు వేదికగా మార్చకుంది భారత్. టెస్టు సిరీస్‌తోపాటు తొలి వన్డేకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించగా.. ఆ తర్వాత నుంచి అతడితోపాటు విరాట్ కోహ్లీ కూడా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. విండీస్‌తో జరిగిన 2 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌కు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించాడు. అయితే, అతడు బౌలర్లను వినియోగించుకున్న తీరుపై సర్వత్రా విమర్శలకు వెల్లువెత్తాయి. వికెట్లు తీస్తూ ఫామ్‌లో ఉన్న బౌలర్లతో పూర్తి ఓవర్ల కోటా వేయించకపోవడం.. బాగా పరుగులు సమర్పిస్తున్న సమయంలో బౌలింగ్ చేయించడం వంటి నిర్ణయాలతో పాండ్య విమర్శల పాలయ్యాడు.
దాంతో పాటు నాలుగో టీ20 సందర్భంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ (49*) హాఫ్ సెంచరీకి సమీపంలో ఉన్నప్పుడు సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు పాండ్య. సీనియర్‌గా, కెప్టెన్‌గా సహచరులకు మార్గదర్శకంగా ఉండాల్సిందిపోయి పాండ్య.. తీవ్ర విమర్శలకు తావిచ్చాడు. మూడు, నాలుగో టీ20ల్లోనూ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు చాహల్. పాండ్య అతడికి కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. ఐదో టీ20లో చాహల్ బౌలింగ్‌లో భారీగా పరుగులు వస్తున్న వేళ.. అతడితోనూ నాలుగు ఓవర్లు వేయించాడు పాండ్య. పవర్‌ప్లే ఓవర్లలోనూ వికెట్లు తీయగే అక్షర్ పటేల్.. సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకూ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో.. ఇలాంటి నిర్ణయాలతో అతడు వెనుకబడే అవకాశం లేకపోలేదు.
ద్రవిడ్ చెప్పినట్లుగా..
Indian Cricket Team Coach Rahul Dravid : అయితే విండీస్‌తో టీ20 సిరీస్ ముగిశాక.. బ్యాటింగ్ విభాగంపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నాడు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్. అతడు చెప్పినట్లుగానే పటిష్ఠమైన బ్యాటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందే. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినా పర్వాలేదు కానీ.. ఎనిమిదో నంబర్ వరకు పరుగులు సాధించే బ్యాటర్లు జట్టులో ఉండటం కీలకమైన అంశం. రాహుల్ ద్రవిడ్ ఆల్‌రౌండర్ల ఆవశ్యకతను చెప్పకనే చెప్పాడు.
కుల్‌దీప్ యాదవ్, చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్లే కానీ రవీంద్ర జడేజాలా బ్యాటింగ్ కూడా చేయలేరు. అక్షర్ పటేల్ ఉన్నన్నప్పటికీ అతడు ఏడో స్థానంలో ఆడాడు. ఆ తరవాతి వారంతా కనీసం బ్యాట్‌ను ఝుళిపించడం కూడా రానివారే ఉన్నారు. ఈ పర్యటనలో భారత్ నేర్చుకోవాల్సిన అంశాల్లో.. లోతైన బ్యాటింగ్ ఆర్డర్‌ను సిద్ధం చేసుకోవడాన్ని ఒకటిగా చెప్పవచ్చు. దాంతోపాటు మరికొంత మంది యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రిజర్వ్ బెంచ్‌నూ బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాలి.
'టీమ్ ప్లేయర్స్ ఎలా ఆడారనేది నాకు తెలుసు.. ఒక్కోసారి ఓటమి నుంచే పాఠాలు'