T20 World Cup : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. పవర్ ప్లేలో పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. భారత బౌలర్ల ధాటికి పాక్ నిలబడలేకపోయింది. ఆ తర్వాత పుంజుకున్న పాక్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్‌లో మొదటి సారి ఆడుతున్న టీమ్ ఇండియా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 32 పరుగులు సమర్పించి 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా కూడా రాణించాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్.. 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షమీ, భువనేశ్వర్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. ఒక పరుగుకే.. 1.1 ఓవర్లో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బాబర్ అజామ్(0)ను పెవిలియన్ పంపించింది టీమ్ ఇండియా. వెంటనే నాలుగో ఓవర్లో 15 పరుగుల వద్ద మరో కీలక బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(4) అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్(51) చెలరేగిపోయి ఆడారు. చివరి వరకు ఉన్న షాన్(52) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో ఇఫ్తికార్ అహ్మద్ మూడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. కొద్దిలో హ్యాట్రిక్ సిక్స్‌లు మిస్ అయ్యాడు. అనంతరం మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అనంతరం క్రీజలోకి దిగిన సాహబ్ ఖాన్(5), హైదర్ అలీ(2), మహ్మద్ నవాజ్(9) పేలవ ప్రదర్శన చేశారు. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో అసిఫ్ అలీ (2) బౌన్స్ అయిన బంతికి షాట్ ప్రయత్నించాడు. బంతి నేరుగా దినేశ్ కార్తిక్ చేతిలోకి వెళ్లింది. దీంతో పాకిస్థాన్ 120 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత షహీన్ అఫ్రిది(16) పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
ఇవీ చదవండి: T20 World Cup 2022 అతి పిన్న, పెద్ద వయసు ఆటగాళ్లు వీరే
'నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం.. ఆ నిర్ణయంతో షాక్‌కు గురయ్యా'