India Vs Pak ICC World Cup 2023 : అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పాల్గొననుందా లేదా అన్న విషయంపై వాడీ వేడీ చర్చలు జరుగుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై చర్చించేందుకు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిందని సమాచారం.
అప్పట్లో భారత్‌లో జరగనున్న పలు మ్యాచ్‌ల వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పాక్ బోర్డ్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో పలు స్టేడియాల్లో తమ జట్టు ఆడదని, ఆ స్టేడియాల్లో పాక్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ వేదిక చెన్నై, ఆస్ట్రేలియాతో జరగబోయే బెంగళూరు వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా ముంబయిలోనూ తమ జట్టు మ్యాచ్‌లను నిర్వహించొద్దని పాక్ విజ్ఞప్తి చేసింది.
Ind vs Pak Worldcup : అయితే పాకిస్థాన్ అభ్యర్థనను బీసీసీఐ, ఐసీసీ పట్టించుకోలేదు. ఆ వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసి తాజాగా ప్రకటించారు. దీంతో పాక్ జట్టు ఇండియాకు వచ్చేందుకు క్లియరెన్స్ ఇచ్చే ముందు వేదికలను పరిశీలించడానికి పాకిస్థాన్ భద్రతా ప్రతినిధి తమకు సంబంధించిన ఓ బృందాన్ని ఇండియాకు పంపించనుంది.
ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌ని ఎన్నుకున్న తర్వాత భద్రతా ప్రతినిధి బృందాన్ని భారత్‌కు ఎప్పుడు పంపాలో విదేశాంగ, అంతర్గత మంత్రిత్వ శాఖతో సహా ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఇంటర్ – ప్రావిన్షియల్ కో- ఆర్డినేషన్ (స్పోర్ట్స్) మంత్రిత్వ శాఖలోని అధికారి ఒకరు వెల్లడించారు. పాకిస్థాన్ ఆడే వేదికలను, ప్రపంచ కప్ లో వారి కోసం ఏర్పాటు చేసిన భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించడానికి భద్రతా ప్రతినిధి బృందం పీసీబీ నుండి ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన ఈ మేరకు తెలిపారు.
World Cup 2023 Ind vs Pak : భారత్ - పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇప్పటి నుంచే ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్ జరిగే వారంలో.. అహ్మదాబాద్ సహా, సమీప నగరాల్లో లగ్జరీ హోటల్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని హోటల్స్‌లో ఒక రోజు బస చేసేందుకు సుమారు రూ. 80 వేల ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం. పాక్ ప్రపంచ కప్‌లో తమ మిగతా మ్యాచ్‌లను కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఆడనుంది.