ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రిజర్వుడే అయిన ఆరో రోజుకు చేరుకుంది. భారత్, న్యూజిలాండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. దొరికిన సమయంలోనే ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం 80 ఓవర్లకు పైగా ఆట సాధ్యమవ్వడం వల్ల గెలుపు సమీకరణాలు రసవత్తరంగా మారాయి. బుధవారం సౌథాంప్టన్ వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది.
మంగళవారంతో పోలిస్తే బుధవారం వాతావరణం మరింత మెరుగ్గా ఉంటుందని తెలిసింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నా చక్కగా వెలుతురు ఉండనుంది. వర్షం కురిసే అవకాశం లేకపోవడం శుభసూచకం. ఉదయం 10 గంటలకు 16 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు 20 డిగ్రీలకు చేరుకుంటుంది. అంటే ఈ రోజు పూర్తి ఆట సాధ్యమవుతుంది. చక్కగా ఎండకాస్తే మాత్రం భారత్‌కే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. చల్లని పరిస్థితులు ఉంటే మాత్రం కివీస్ ఆధిపత్యం చెలాయిస్తుంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులకు ఆలౌటైంది. డేవాన్ కాన్వే (54), కేన్ విలియమ్సన్ (49) రాణించడంతో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. ఆ తర్వాత 32 పరుగుల లోటుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమ్‌ఇండియా ఐదోరోజు ఆట ముగిసే సరికి 64/2తో నిలిచింది. ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చెతేశ్వర్ పుజారా (12*), విరాట్ కోహ్లీ (8*) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ తొలి సెషన్ పూర్తిగా నిలిస్తే మ్యాచ్ డ్రా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. భారత్‌ను త్వరగా ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగితే ఉత్కంఠ పెరగడం ఖాయం.
ఇవీ చదవండి: