IND VS NZ ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు భారత్ 307 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (50: 65 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (72: 77 బంతుల్లో 13 ఫోర్లు)తోపాటు శ్రేయస్ అయ్యర్ (80: 76 బంతుల్లో 4 ఫోర్ల, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. అయితే చివర్లో వాషింగ్టన్ సుందర్ (37: 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించాడు. రిషభ్ పంత్ (15), సూర్యకుమార్ (4) విఫలం కాగా.. సంజూ శాంసన్ (36) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3, టిమ్ సౌథీ 3, ఆడమ్ మిల్నే ఒక వికెట్ తీశారు.
కివీస్‌పై హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన శిఖర్ ధావన్
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్ (72) తొలి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (50)తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ మరో మైలురాయిని అందుకొన్నాడు. ధావన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిస్ట్ - A క్రికెట్‌లో 12వేల పరుగుల మార్క్‌ను తాకిన ఏడో భారత బ్యాటర్‌గా అవతరించాడు. ధావన్ 297 మ్యాచుల్లో 12,025 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 167 అంతర్జాతీయ వన్డేలు ఉన్నాయి. 17 శతకాలు, 39 అర్ధశతకాలతో 6,744 పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్ కంటే ముందు ఆరుగురు బ్యాటర్లు ఈ రికార్డును సాధించారు. సచిన్ తెందూల్కర్ అందరి కంటే ముందున్నాడు. కెరీర్‌లో 551 మ్యాచుల్లో 21,999 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సౌరభ్ గంగూలీ (437 మ్యాచుల్లో 15,622), రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచుల్లో 15,271), విరాట్ కోహ్లీ (296 మ్యాచుల్లో 13,786), మహేంద్ర సింగ్ ధోనీ (423 మ్యాచుల్లో 13,353), యువరాజ్ సింగ్ ( 423 మ్యాచుల్లో 12,633) ఉన్నారు.