భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. భారత్ విజయానికి 100 పరుగులు అవసరం కాగా.. బంగ్లా తన గెలుపునకు 6వికెట్ల దూరంలో నిలబడింది. మూడో రోజు 7పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించిన బంగ్లా జట్టు, భారత బౌలర్ల ధాటికి 231కు ఆలౌట్ అయింది. తద్వారా భారత్‌కు 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ 73, జాకిర్ హసన్ 51 పరుగులతో రాణించారు. నురుల్ హసన్, టస్కిన్ అహ్మద్ చెరో 31 పరుగులతో పర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలోఅక్సర్ పటేల్ 3, సిరాజ్ 2, అశ్విన్ 2 రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను బంగ్లా బౌలర్లు తీవ్రంగా దెబ్బకొట్టారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ఘోరంగా విఫలం కాగా, తొలి టెస్టులో రాణించిన శుబ్‌మన్, ఛెతేశ్వర్ పుజారాలు కూడా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.
ఏకాగ్రతతో కొద్దిసేపు ఆడిన విరాట్ కోహ్లీ సైతం ఔటయ్యాడు. దీంతో భారత్ 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం.. 26 పరుగులతో అక్సర్, మూడు పరుగులతో.. జయదేవ్ ఉనద్కత్ క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ 23 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు మెహిదీ హసన్ 3, షకిబ్ ఒక వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా భారత్ వంద పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.
'90'ల్లో ఔట్.. అయినా ఆనందంగా ఉంది : రిషబ్ పంత్
టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరోసారి '90'ల్లో ఔటై పెవిలియన్‌కు చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడిన రిషభ్ 93(105 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగుల వద్ద మెహిదీ హసన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇలా '90'ల్లో ఔటై టెస్టుల్లో ఆరో సెంచరీని రిషభ్ చేజార్చుకొన్నాడు. మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (87)తో కలిసి ఆదుకొన్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 159 పరుగులను జోడించారు.
తాను ఔట్ అవడంపై స్పందించిన పంత్ మట్లాడుతూ.. ''జట్టుకు సాయం అందించడంపైనే ఆలోచిస్తా కానీ.. మైలురాళ్ల గురించి కాదు. వ్యక్తిగతంగా వాటిని పట్టించుకోను. అవన్నీ నా దృష్టిలో కేవలం నంబర్లు మాత్రమే. పరిస్థితికి తగ్గట్లుగా ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తా. ఈ క్రమంలో సెంచరీ నమోదైతే ఆనందిస్తా. ఒకవేళ కాకపోతే మాత్రం నిరాశ చెందను. వ్యక్తిగతంగా అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తానని నాకు తెలుసు. సెంచరీ చేజారిందని తెలుసు. అయితే శ్రేయస్‌తో కలిసి జట్టును ఇబ్బందుల్లో నుంచి బయటపడేయడం ఆనందంగా ఉంది'' అని పంత్ స్పష్టం చేశాడు.