భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డే సకాలంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో వర్షం పూర్తిగా తగ్గి ఎండ వచ్చింది. దీంతో మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది మైదానంలో కవర్లను తొలగించి వర్షపు నీటిని బయటకు పంపిచారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాసేపట్లో టాస్ వేయనున్నారు. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా జట్లు మైదానానికి చేరుకున్నాయి.
వర్షం తగ్గడం.. అనుకున్న సమయానికి మ్యాచ్ జరుగుతుండటంతో వైజాగ్ స్టేడియం వద్ద సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. టికెట్లు ఉన్నవాళ్లను స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. వైజాగ్‌లో గత రెండు రోజులతో పాటు ఆదివారం కూడా వర్షం కురవడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహం నెలకొంది. ఎట్టకేలకు ఉదయం 11.30 గంటల నుంచి వర్షం నిలిచిపోయి ఎండ రావడంతో మ్యాచ్ నిర్వహణపై ఆశలు చిగురించాయి.
అయితే మ్యాచ్ కోసం భారత్ ఆస్ట్రేలియా జట్ల క్రీడాకారులు.. శనివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య నేరుగా రాడిసన్ బ్లూ హోటల్‌కు తరలించారు. విశాఖ మధురవాడ క్రికెట్ స్టేడియం భారత్ జట్టు విజయానికి బాగా కలిసి వచ్చిన మైదానంగా చెబుతారు. ఇక్కడి గణాంకాలు చూసుకుంటే.. భారత్ జట్టు చాలా సందర్భాలలో మెరుగైన ఆట తీరును కనబర్చింది.
ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 39.5 ఓవర్లలోనే ఛేదించింది. కేఎల్ రాహుల్ (75*) హాఫ్‌సెంచరీ సాధించగా.. రవీంద్ర జడేజా (45) కీలక రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (25), శుబ్‌మన్ గిల్ (20) పర్వాలేదనిపించారు. మిచెల్ స్టార్క్ 3, స్టోయినిస్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలి వన్డేలో రాణించిన రాహుల్.. టీ20, టెస్టుల్లో వరుసగా విఫలమవుతూ జట్టులో చోటు కూడా కోల్పోయిన కేఎల్ రాహుల్.. వన్డేల్లో మాత్రం తన క్లాస్ గేమ్‌ను చూపించాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న గిల్, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో విఫలమైన నేపథ్యంలో.. హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచి టీమ్ఇండియాను ఆదుకున్నాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. 91 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసి తన వన్డే కెరీర్లో 13వ అర్ధ శతకం అందుకున్నాడు.