ఆస్ట్రేలియాలో టీమ్ఇండియా పర్యటన చివరి దశకు చేరుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బయోబబుల్ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు భారత క్రికెటర్లను శనివారం ఐసోలేషన్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు జరగనున్న బ్రిస్బేన్‌కు వెళ్లడానికి టీమ్ఇండియా సుముఖంగా లేదని తెలుస్తోంది.
"ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లినప్పుడు.. ఆ తర్వాత ఆసీస్ పర్యటనలో సిడ్నీ చేరుకున్నాక 14 రోజుల చొప్పున దాదాపు నెల రోజులపాటు మేము (భారత జట్టు) క్వారంటైన్లో ఉన్నాం. పర్యటన చివర్లో మరోసారి క్వారంటైన్‌కు వెళ్లాలనుకోవడం లేదు. గ్రౌండ్లోకి కాకుండా మరోసారి హోటల్లో చిక్కుకునే పరిస్థితి ఉంటే బ్రిస్బేన్ వెళ్లడానికి మేము సిద్ధంగా లేము. దాని బదులు వేరే ఏదైనా నగరంలో చివరి రెండు టెస్టులు ఆడి, సిరీస్ ముగించుకొని స్వదేశానికి తిరిగి వెళ్లడానికి మాకేం ఇబ్బంది లేదు."
-టీమ్ఇండియా ప్రతినిధి
షెడ్యూల్ ప్రకారం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోని చివరి టెస్టుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు. జనవరి 15 నుంచి 19 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. బ్రిస్బేన్‌లో కొవిడ్ ఉద్ధృతి, ఆంక్షల వల్ల భారత క్రికెటర్లు మరోసారి లాక్డౌన్లో ఉండాల్సి వస్తే అది వారి ఆటపై దుష్ప్రభావం చూపుతుందని టీమ్ఇండియా ఆందోళన వ్యక్తంచేస్తోంది.
"ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకోగలం. బయోబబుల్ నిబంధనలను పాటించడంలో క్రికెట్ ఆస్ట్రేలియాతో అడుగడుగునా సహకరించాం. ఇదివరకే సిడ్నీలో క్వారంటైన్లో ఉన్నందున.. ఆంక్షల విషయంలో సగటు ఆస్ట్రేలియన్ల తరహాలోనే మమ్మల్ని కూడా పరిగణించాలని భావిస్తున్నాం. ఇప్పటికే దాదాపు 6 నెలలు మా క్రికెటర్లు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లో ఉన్నారు. అది అంత సులభమైన విషయం కాదు. మహమ్మారి వేళ పర్యటనల్లో ఎలాంటి సమస్యలు రాకుండా వ్యవహరిస్తున్నాం. ఇంత చేశాక బ్రిస్బేన్‌లో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురవుతుందంటే అందుకు మేము సుముఖంగా లేము."
-టీమ్ఇండియా ప్రతినిధి
ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన భారత్, ఆసీస్ చెరో గెలుపుతో సమంగా ఉన్నాయి. సిడ్నీ వేదికగా మూడో టెస్టు జనవరి 7న ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: రోహిత్.. ఎక్కడ ఆడతాడు? వేటు ఎవరిపై?