ఐపీఎల్-13 కోసం వివిధ జట్ల తరపున పోటీపడిన భారత ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలవాల్సిన సమయం వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా పర్యటన కోసం కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా యూఏఈ నుంచి గురువారం బయల్దేరనుంది. నేరుగా సిడ్నీ చేరుకున్న తర్వాత జట్టు అక్కడే క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్ చేయనుంది.
ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు సైతం.. భారత జట్టుతో కలిసి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. అయితే కేవలం టెస్టు జట్టుకు మాత్రమే ఎంపికైన పుజారా, హనుమ విహారి లాంటి ఆటగాళ్లు ఇక్కడే ఐసీసీ అకాడమీలో సాధన చేయనున్నారు. డేనైట్ టెస్టు కోసం వాళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రత్యేకంగా సాధన సాగించనున్నారు.
కోలుకున్న తర్వాత..
మరోవైపు కేవలం టెస్టుల్లోనే ఆడనున్న రోహిత్ శర్మ తిరిగి ముంబయికి రానున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో తన జట్టును విజేతగా నిలిపిన అతను.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. కంగారూ గడ్డపై భారత జట్టు ఈ నెల 27న ఆరంభమయ్యే సిరీస్‌లో భాగంగా మొదట మూడు వన్డేలు, మూడు టీ20లు, చివరగా నాలుగు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు (డేనైట్) వచ్చే నెల 17న అడిలైడ్‌లో ఆరంభం కానుంది.
ఇదీ చూడండి:భారత్‌తో సిరీస్‌లో స్వదేశీ జెర్సీలతో ఆసీస్