టెస్టుల్లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ తెలిపాడు. ఐర్లాండ్‌తో టెస్ట్ సిరీస్ గెలవడం మర్చిపోలేమని అన్నాడు. ఈ గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. ఆడిన రెండో మ్యాచ్‌లోనే మొదటి టెస్ట్ గెలిచిన జట్టుగా ఆఫ్ఘన్ జట్టు రికార్డు సృష్టించింది.
"ఈ రోజును మరువలేం. టెస్ట్ క్రికెట్ విభిన్నమైనది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగల్లో మా ఆటగాళ్లు రాణించారు. రహ్మత్ షా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. తొలిసారి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న రషీద్ ఖాన్ ఆకట్టుకున్నాడు. టెస్ట్ క్రికెట్లోనూ మేము రాణిస్తామనడానికి ఇదే నిదర్శనం. టెస్టుల్లో మొదటి స్థానంలో ఉన్న భారత్ స్వదేశంలో బాగా ఆడగలదు. అందుకే మా తొలి టెస్టులో ఓడిపోయాం" -- మహమ్మద్ నబీ, ఆఫ్ఘన్ ఆటగాడు
ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో ఆఫ్ఘన్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రహ్మత్ షా(98), హష్మతుల్లా షాహిది(61) అర్ధశతకాలతో రాణించారు. రషీద్ ఖాన్ 5 వికెట్లతో అదరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రహ్మత్ షా ఎంపికయ్యాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే టెస్ట్ సిరీస్ గెలిచిన రికార్డు ఆసీస్ పేరిట ఉంది.