ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో తన తండ్రి కల నెరవేర్చాడు హైదరాబాద్ కుర్రాడు, టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. తొలిసారిగా టెస్టుల్లో బరిలోకి దిగిన అతడు బంతితో ఔరా అనిపించాడు. తొలిటెస్టులో షమీ గాయపడగా.. రెండో మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న సిరాజ్ మొదటిరోజు ప్రదర్శనతో కెప్టెన్ రహానె, కోచ్ రవిశాస్త్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. లంచ్ బ్రేక్ అనంతరం బౌలింగ్‌కు దిగిన సిరాజ్.. ఆసీస్ కీలక ఆటగాళ్లు లబూషేన్ (48), గ్రీన్ (12)ను పెవిలియన్‌కు చేర్చాడు.
అలా వెలుగులోకి..
హైదరాబాద్‌లోని పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్ భారత క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి మహ్మద్ గౌస్ (53) కీలకపాత్ర పోషించాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్‌ను ప్రోత్సహించాడు. 2015 వరకు సిరాజ్.. స్థానిక టోర్నీలకే పరిమితమై సత్తా చాటేవాడు. 2016-17 సీజన్లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున అదరగొట్టి.. వెలుగులోకి వచ్చాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 41 వికెట్లు తీశాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టి..
రంజీల్లో సిరాజ్ ప్రదర్శన మెచ్చి.. 2017 ఐపీఎల్‌కు అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 2018 నుంచి అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో ఆర్సీబీ తరఫున 9 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 11 వికెట్లు తీశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన గణాంకాలు (4-2-8-3) నమోదు చేశాడు. బహుశా ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే సెలెక్టర్లు అతణ్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసి ఉంటారు.
దుఃఖాన్ని దిగమింగుకుని..
ఐపీఎల్‌లో మెరుపులతో సిరాజ్ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే అక్కడికెళ్లాక అతడి తండ్రి మరణించాడన్న వార్త విన్నాడు. ఆ సమయంలో.. భారత్‌కు తిరిగి వచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తామన్నా అతడు నిరాకరించాడు. భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అక్కడే ఆగిపోయాడు. తండ్రి కోరుకున్నట్టుగా దేశానికి సేవ చేయడమే ప్రధానమని నిశ్చయించుకున్నాడు.
తాను క్రికెట్లో ఎదిగి, అంతర్జాతీయ స్థాయికి చేరడానికి కారణమైన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడంపై సిరాజ్ ఎంత బాధ పడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ దుఃఖాన్ని ఆటతోనే దిగమింగాడు. ''ఏదో ఒక రోజు అందరూ వెళ్లిపోవాల్సిందే. ఈ రోజు మీ నాన్న. రేపు నేనూ.. నాన్న కోరుకున్నది సాధించు" అని తల్లి చెప్పిన మాటలు.. సిరాజ్‌ను టెస్టులో స్థానం దిశగా నడిపించాయి.
ఇదీ చూడండి:మెల్బోర్న్లో మూడో టెస్టు.. మరింత మంది ప్రేక్షకులు!