టీమిండియా కెప్టెన్ కోహ్లీ జెర్సీ నంబర్ ఎంత.. వెంటనే 18 అని చెబుతారు అభిమానులు. వన్డే, టీ 20ల్లో జెర్సీలపై పేర్లు, నంబర్లుంటాయి. కానీ టెస్టుల్లో ఉండవు. ఇకమీదట టెస్టుల్లోనూ జెర్సీపై పేర్లు నంబర్లను చూడబోతున్నాం. విరాట్ కోహ్లీ తెలుపు జెర్సీల్లోనూ 18వ నంబరుతో కనిపించనున్నాడు. ఆగస్టు 1 నుంచి జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో జెర్సీలపై పేర్లు, నంబర్లతో బరిలో దిగనున్నారు ఆటగాళ్లు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐసీసీ.
140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు జెర్సీపై పేర్లు, నంబర్లు లేవు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలు ఇప్పటికే తమ దేశవాళీ టోర్నమెంట్లలో పేర్లు, నంబర్లున్న జెర్సీలను వాడారు . ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కూడా పేర్లున్న టీ షర్టులతో బరిలో దిగనున్నారు.
"టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లు ఉంచుతున్నాం. ఆగస్టు 1 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఈ విధానం ప్రారంభమవుతుంది. టెస్టు క్రికెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం"
-- క్లేర్ ఫుర్లాంగ్, ఐసీసీ జనరల్ మేనేజర్
సచిన్ తెందుల్కర్ వన్డే జెర్సీ నంబర్ 10, మహేంద్ర సింగ్ ధోనీ నంబర్ 7 గల జెర్సీలను టెస్టు క్రికెట్లో వాడరని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సచిన్ 10వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించలేదు. ధోనీ జెర్సీపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశముంది.