అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైన భారత జట్టుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, కోచ్‌ను పలువురు నెటిజన్లు తిట్టిపోశారు. అయితే మధ్యలో భారత మాజీ ఆటగాడు, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్‌ను భారత బ్యాటింగ్ కోచ్‌గా పొరబడ్డాడు ఓ నెటిజన్. అదే తడవుగా అతనిపై ట్విట్టర్లో వ్యంగాస్త్రాలు సంధించాడు.
"బ్యాటింగ్ కోచ్ మీమ్స్ చేయడంలో నిమగ్నమై ఉంటే.. ఇంక బ్యాట్స్‌మెన్ నుంచి ఏం ఆశించగలం" అని మోహిత్ అనే అభిమాని ట్విట్టర్లో అసహనం వ్యక్తం చేశాడు. దానికి జాఫర్ గతంలో చేసిన మీమ్స్‌ను జతచేశాడు.
అయితే ఈ విమర్శలను కూల్‌గా తీసుకున్న జాఫర్.. అభిమాని పొరపాటును ప్రశాంతంగా సరిచేశాడు. "నేను బ్యాటింగ్ కోచ్‌ను కాదు మోహిత్" అంటూ అతనికి బదులిచ్చాడు. 2020 ఐపీఎల్ సందర్భంగా జాఫర్.. వరుసగా మీమ్స్ చేస్తూ ట్విట్టర్లో చురుకుగా ఉన్నాడు.
తొలి టెస్టులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. నాలుగు మ్యాచుల సిరీస్‌లో రెండోది డిసెంబర్ 26న మెల్బోర్న్లో జరగనుంది. రెండో టెస్టు నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండనని ఇదివరకే స్పష్టం చేయగా.. తొలి మ్యాచ్‌లో గాయపడిన పేసర్ మహ్మద్ షమీ కూడా జట్టుకు దూరమయ్యాడు.
ఇదీ చూడండి: 'టీమ్ఇండియా ఈ మార్పులు చేయాలి'