India Test Captaincy News: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాదనలకు మద్దతు పలికాడు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ సరైనోడు అని అన్నాడు.
"ముంబయి ఇండియన్స్‌కు సారథిగా రోహిత్ బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను ఆ జట్టులోనే ఉన్నాను. మెగా వేలంలో నన్ను ఆ టీమ్ కెప్టెన్‌గా తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్‌ల తర్వాత నేను సరిగ్గా ఆడలేదు. కాబట్టి నా స్థానంలో మరో అంతర్జాతీయ ఆటగాడు రావాలని తప్పుకున్నాను. అప్పుడు టీమ్ యాజమాన్యం ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని మిగతా కోచ్‌లతో చర్చలు జరిపింది. కొంతమంది పేర్లను పరిశీలించింది. కానీ కెప్టెన్‌గా రోహిత్ శర్మనే తీసుకుంటారని నాకు ఓ క్లారిటీ ఉంది. ఆ తర్వాత టీమ్ మేనేజ్మెంట్ కూడా అతడినే ఎంపిక చేసింది."
- రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
రోహిత్ విజయవంతమైన నాయకుడని.. కొన్ని సందర్భాల్లో అతడు జట్టును ముందుండి సమర్థవంతంగా నడిపించాడన్నాడు. ఆ సమయంలో ప్రపంచంలో ఇతర ఏ ప్లేయర్ ఆడని విధంగా గొప్పగా ఆడాడని.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసన్నాడు.
"కెప్టెన్‌గా అజింక్య రహానెకు మంచి మార్కులే పడతాయి.. ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లను గెలిపించిన విధానమే ఇందుకు నిదర్శనం. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పేరు కూడా వినిపిస్తోంది. రాహుల్ విధ్వంసకర ఆటగాడు. బాగా ఆడతాడు. టెస్టు రికార్డు కూడా బాగుంది. ముఖ్యంగా విదేశాల్లో బాగా రాణించాడు. అయితే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగలిగేది మాత్రం రోహిత్ శర్మనే" అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
'కోహ్లీ నిర్ణయం ఓ షాక్'
Ricky Ponting Virat Kohli: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత సారథిగా నిలిచిన విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడం తనను విస్మయానికి గురి చేసిందన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్. అయితే బ్యాట్‌తో మరింత మెరుగ్గా రాణించి.. రికార్డులు కొల్లగొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ.. గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాడని పాంటింగ్ కొనియాడాడు. అతని సారథ్యంలో భారత జట్టు గతంలో కంటే విదేశాల్లో ఎక్కువ టెస్టులు గెలవడం ద్వారా తన ఓవర్సీస్ రికార్డును మెరుగుపరుచుకుందన్నాడు.
బలమైన కారణమే ఉంటుంది: దినేశ్
కోహ్లీ.. భారత టెస్టు జట్టును పటిష్ఠం చేశాడని ప్రశసించాడు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. అయితే అతడు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక సరైన కారణమే ఉంటుందన్నాడు. ఏదేమైనా అతడు జట్టును చక్కగా నడిపించాడని కొనియాడాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: మహీతో విభేదాలు లేవు.. బీసీసీఐతోనే!: భజ్జీ