Ind Vs Sl Test: మళ్లీ మెరిసేందుకు గులాబి బంతి వచ్చేసింది.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో అది చేసే మాయను ఆస్వాదించేందుకు రంగం సిద్ధమైంది. డేనైట్ టెస్టులకు ఇంకా పూర్తిగా అలవాటు పడని టీమ్‌ఇండియా.. ఇప్పుడదే మ్యాచ్‌లో శ్రీలంక భరతం పట్టేందుకు సై అంటోంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ రెండు జట్ల మధ్య తొలి డేనైట్ పోరు శనివారమే ఆరంభమవుతుంది. టెస్టు కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో ఘన విజయం అందుకున్న రోహిత్.. సారథిగా తన మొట్టమొదటి గులాబి బంతి పోరులో జట్టును ఎలా నడిపిస్తాడనే ఆసక్తి కలుగుతోంది.
భారత గడ్డపై మరోసారి గులాబి బంతి పోరుకు వేళైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు ఆరంభం కానున్న డేనైట్ మ్యాచ్‌లో శ్రీలంకతో టీమ్‌ఇండియా తలపడుతుంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపంతో తొలి టెస్టులో ప్రత్యర్థిని చిత్తుచేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి లంకను ఊడ్చేయాలని చూస్తోంది. ప్రదర్శన పరంగా భారత్‌కు ఎలాంటి సమస్యల్లేవు. గత మ్యాచ్‌లో టాప్‌ఆర్డర్ బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు. కానీ వాళ్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉంది. పంత్, అశ్విన్ అర్ధశతకాలతో రాణించారు. ఇక 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జడేజా తన కెరీర్‌లోనే చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో జడ్డూ, అశ్విన్ మాయాజాలంతో జట్టుకు తిరుగులేకుండా పోయింది. మరోవైపు అన్ని విభాగాల్లోనూ బలహీనంగా కనిపిస్తున్న లంక.. డేనైట్ మ్యాచ్‌లో భారత్‌కు ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి. మ్యాచ్‌ను కనీసం నాలుగో రోజుకు తీసుకెళ్లాలంటే ఆ జట్టు ఉత్తమంగా రాణించాల్సిందే.
కూర్పు ఎలా?
గులాబి బంతి పోరు కోసం టీమ్‌ఇండియా కూర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి రేకెత్తుతోంది. తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన జయంత్ యాదవ్‌పై వేటు ఖాయమే. మరి అతని స్థానంలో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ వస్తాడా? లేదా పేసర్ సిరాజ్‌ను ఆడిస్తారా? అన్నది సందేహంగా మారింది. భారత్ చివరగా ఆడిన డేనైట్ టెస్టు (2021లో అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో)లో అక్షర్.. మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు కూల్చి రెండు రోజుల్లోనే ప్రత్యర్థి కథ ముగించాడు. గులాబి బంతితో అతని ప్రదర్శన ఆధారంగా మరోసారి బరిలో దించే అవకాశం ఉంది. మరోవైపు పిచ్‌పై పచ్చిక ఉంటే మాత్రం సిరాజ్‌ను ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో హనుమ విహారికి మరో అవకాశమిస్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే ఆ స్థానం విహారికే శాశ్వతం కాదని రోహిత్ చెప్పిన నేపథ్యంలో అనుమానాలు కలుగుతున్నాయి. గత మ్యాచ్‌లో ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విహారి (58) అర్ధశతకం సాధించింది.
ప్రత్యర్థికి కష్టమే..
స్వదేశంలో చివరగా ఆడిన డేనైట్ టెస్టులో ఇంగ్లాండ్‌ను రెండు రోజుల్లోనే రెండు సార్లు ఆలౌట్ చేసి భారత్ మ్యాచ్ ముగించింది. ఇప్పుడు లంకకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణ బంతితో సాగిన తొలి టెస్టులోనే బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించలేక మూడు రోజుల్లోనే ఓటమి మూటగట్టుకున్న ఆ జట్టు.. ఇప్పుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో భారత బౌలర్ల జోరు ముందు నిలబడుతుందా? అన్నది అనుమానమే. బ్యాటింగ్‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే పరుగులు సాధించి సహచరుల్లో స్ఫూర్తి నింపాలని జట్టు కోరుకుంటోంది. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. తిరిమానె, ధనంజయ, డిక్వెలా.. ఇలా నైపుణ్యవంతులైన ఆటగాళ్లు క్రీజులో నిలబడితే ఆ జట్టుకు ఆందోళన తప్పుతుంది. చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న పేసర్ సురంగ లక్మల్‌పై ప్రత్యేక దృష్టి ఉంది. స్పిన్నర్లు భారత బ్యాటర్లను మరోసారి ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
లంకకు దెబ్బ..
ఇప్పటికే తొలి టెస్టులో ఘోర పరాజయంతో డీలా పడ్డ శ్రీలంకను తాజాగా ఆటగాళ్ల గాయాల సమస్య కలవరపెడుతోంది. వెన్నెముక గాయంతో బ్యాటర్ నిశాంక దూరమవడంతో మ్యాచ్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను అజేయంగా 61 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పేసర్ లాహిరు కుమార గాయంతో రెండో టెస్టు ఆడడం లేదు. అతని స్థానంలో జట్టులోకి తీసుకుందామనుకున్న చమీర కూడా ఇంకా చీలమండ గాయం నుంచి కోలుకోలేదు. కుశాల్ మెండిస్ ఫిట్‌నెస్ సాధించడం ఆ జట్టుకు ఉపశమనాన్నిచ్చే విషయం. కుశాల్‌తో పాటు ప్రవీణ్ జయవిక్రమ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అసలంక స్థానంలో దినేశ్ చండిమల్‌ను ఆడించాలని జట్టు భావిస్తున్నట్లు తెలిసింది. ఫెర్నాండోకు బదులు చామికను ఆడించనుంది.
పిచ్ ఎలా ఉంది?
ఫ్లాట్‌గా ఉండే చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. చిన్న బౌండరీలు కూడా బ్యాటర్లకు మరింత మేలు చేస్తాయి. ఇక్కడ ఇదే తొలి గులాబి బంతి పోరు కాబట్టి పేసర్లకు స్వింగ్ లభించే అవకాశముంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. చివరగా 2018 జూన్‌లో ఇక్కడ జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 262 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేసింది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, మయాంక్, విహారి, కోహ్లి, శ్రేయస్, పంత్, జడేజా, అశ్విన్, అక్షర్/సిరాజ్, షమి, బుమ్రా
శ్రీలంక: కరుణరత్నే, తిరిమానె, కుశాల్ మెండిస్, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, అసలంక/దినేశ్, డిక్వెలా, లక్మల్, ఎంబుల్దేనియా, జయవిక్రమ, చామిక
కోహ్లీకి భలే ఛాన్స్..
రెండేళ్లకు పైగా శతక నిరీక్షణ కొనసాగిస్తున్న కోహ్లీకి దానికి ముగింపు పలికేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాకపోవచ్చు. చివరగా అతను అంతర్జాతీయ శతకం చేసింది డేనైట్ టెస్టు (2019లో బంగ్లాదేశ్‌పై 136)లోనే కావడం విశేషం. మళ్లీ ఇప్పుడు గులాబి బంతి పోరు అతణ్ని ఊరిస్తోంది. పైగా తనకు రెండో ఇల్లు లాంటి చిన్నస్వామి స్టేడియం.. కోహ్లి 71వ శతక సంబరాల కోసం ఎదురు చూస్తోంది. తనకెంతో ప్రత్యేకమైన ఈ చోట.. పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియంలో.. అతను సెంచరీ అందుకుంటే చూడాలన్నది భారత అభిమానుల కోరిక. టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అతను తొలిసారి మూడంకెల స్కోరు అందుకుంటే అంతకుమించి ఇంకేం కావాలి. కోహ్లి ఫామ్ బాగానే ఉంది. ఉత్తమంగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు అలవోకగా శతకాలు బాదిన అతనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే అతని సెంచరీ కోసం అభిమానులు ఇంతలా ఎదురు చూస్తున్నారు. తన వందో టెస్టులో ఎలాగో ఆ ముచ్చట తీరలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఆ ఎదురు చూపులకు కోహ్లి తెరదించుతాడేమో చూడాలి. గత మ్యాచ్‌లో చక్కగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించిన అతను.. స్పిన్నర్ ఎంబుల్దేనియా చేతికి చిక్కాడు. ఈ సారి అలాంటి పొరపాటు చేయకుండా ఉంటే వందను అందుకోవడం సాధ్యమే.
రెండిట్లో గెలుపు..
భారత్ ఇప్పటివరకూ ఆడిన డే అండ్ నైట్ టెస్టులు 3. 2 మ్యాచ్‌ల్లో (స్వదేశంలో 2019లో బంగ్లాదేశ్‌పై, 2021లో ఇంగ్లాండ్‌పై) గెలిచి.. ఓ మ్యాచ్ (2020లో ఆసీస్‌లో) ఓడింది.
ఇవీ చూడండి:
IND vs SL 2nd Test: 'తుది జట్టు ఎంపిక దానిమీదే ఆధారపడి ఉంది'