IND VS SL Ishan kishan injury: టీమ్ఇండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో శ్రీలంకతో సిరీస్‌కు దూరమవ్వగా ఇప్పుడు యువ ప్లేయర్ ఇషాన్ కూడా మూడో టీ-20కి దూరమయ్యాడు.
శనివారం లంకతో జరిగిన రెండో టీ20లో అతడి తలకు బంతి తగిలి గాయమైంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో లహిరు కుమారా 147.6 కిమీ వేగంతో బౌన్సర్ వేశాడు. దానిని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. వెంటనే ఫిజియో వచ్చి అతడిని పరిశీలించాడు.
ఆ తర్వాత అక్కడి ఓ హాస్పిటల్‌కు ఇషాన్‌ను తరలించారు. తలకు తగిలినది బలమైన గాయమా లేదా సాధారణమైనదా అని తెలుసుకునేందుకు బ్రెయిన్ స్కానింగ్ చేశారు. అనంతరం అతడిని డిశ్చార్జి చేశారు. అయితే.. బీసీసీఐ వైద్య బృందం అతడిని దగ్గరుండి పర్యవేక్షించనుంది. ఈ నేపథ్యంలో మూడో టీ-20కి అతడిని దూరంగా ఉంచినట్లు బీసీసీఐ తెలిపింది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక ఆటగాడు చండీమాల్ ఫీల్డింగ్ చేస్తుండగా చేతి బొటన వేలికి గాయమైంది. అతడిని కూడా ఇదే ఆస్పత్రికి తరలించారు చికిత్స అందించారు.
రెండో టీ20 టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో టీ20 నేడు(ఆదివారం) సాయంత్రం ధర్మశాలలో జరగనుంది.
ఇదీ చూడండి: IPL 2022: కొత్త లుక్‌లో ధోనీ.. ఎవరూ గుర్తుపట్టలేనంతగా!