IND VS SA Umran malik: ఐపీఎల్ 15వ సీజన్లో జమ్ముకశ్మీర్ పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ హైదరాబాద్ తరఫున ఆడి చక్కటి ప్రదర్శన కనబరిచాడు. 150 కి.మీ. వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్లను హడలెత్తించాడు. ఓ మ్యాచ్‌లోనైతే ఏకంగా 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 14 మ్యాచ్‌ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో సౌతాఫ్రికాతో జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఉమ్రాన్ ప్రస్తుతం భారత జట్టుతో పాటు శిక్షణ పొందుతున్నాడు. తాజాగా బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో మాలిక్ టీమ్‌ఇండియాకు ఎంపికైనప్పటి క్షణాలను గుర్తుచేసుకున్నాడు. హైదరాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్.. టీ20 లీగ్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే తనకు భారత జట్టు నుంచి పిలుపు వస్తుందని అంచనా వేశాడని ఉమ్రాన్ వెల్లడించాడు.
"నేను భారత జట్టుకు ఎంపికైనప్పుడు డేల్ స్టెయిన్ జట్టు బస్సులో నాతో ఉన్నారు. అప్పుడు మేం మ్యాచ్ ఆడటానికి వెళ్తున్నాం. బస్సులో ఉన్న అందరూ నన్ను అభినందించారు. 'నువ్వు టీమ్ఇండియాకి ఎంపిక అవుతావని టీ20 లీగ్‌కి ముందే చెప్పాను. భగవంతుని దయతో సీజన్ ముగిసిన తర్వాత సరిగ్గా అదే జరిగింది అని డేల్ స్టెయిన్ అన్నాడు. ఇప్పుడు టీమ్ ఇండియా కోసం నా శక్తిమేరకు కృషి చేయడమే నా లక్ష్యం. రాహుల్ సర్ (ద్రవిడ్)ని కలిసి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అతడు దిగ్గజ ఆటగాడు. నేను చేసే పనిని కొనసాగించమని చెప్పాడు" అని ఉమ్రాన్ మాలిక్ బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: బెంగాల్ అదుర్స్.. తొలి 9మంది 50ప్లస్ స్కోరు.. 129ఏళ్ల రికార్డు బద్దలు