Bumrah Injury: టీమ్ఇండియాను మరోసారి గాయాల బెడద వణికిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. తాజాగా సఫారీ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో బౌలింగ్ చేస్తున్న సమయంలో పేసర్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అతడికి ఏం జరిగిందో అని ఒక్కసారిగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఏం జరిగింది?
తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా కాలి మడిమ మెలితిరిగింది. దీంతో నొప్పితో విలవిలలాడాడీ పేసర్. టీమ్ఇండియా ఫిజియో నితిన్ పటేల్ బుమ్రా దగ్గరకు వచ్చి గాయాన్ని పరిశీలించాడు. అనంతరం బుమ్రా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది.
పట్టుబిగిస్తున్న భారత్
ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. అనంతరం బౌలర్లు ప్రొటీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నారు. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఎల్గర్ (1)ను బుమ్రా పెవిలియన్ పంపాడు. అనంతరం మర్క్రమ్ (13), పీటర్సెన్ (15)ను షమీ బోల్తా కొట్టించాడు. ఇక వాండర్ డస్సేన్ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 32 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న డికాక్ (34)ను శార్దూల్ వెనక్కి పంపాడు. ప్రస్తుతం బవుమా, ముల్దర్ క్రీజులో ఉన్నారు.