IND vs SA Series: మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సిన టీమ్‌ఇండియా షెడ్యూల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగు చూడటం వల్ల పర్యటనపై సందిగ్ధత నెలకొంది. అయితే, అక్కడికి వెళ్లేందుకు టీమ్‌ఇండియా సానుకూలంగా ఉందని తెలిసింది. కాకపోతే ఒక వారం పది రోజులు షెడ్యూల్‌ను వాయిదా వేయాలని భావిస్తోంది. ఒకవేళ అనుకున్నట్లే ఈ పర్యటన సాగితే టీమ్‌ఇండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాలకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. కొంతకాలంగా ఇద్దరూ పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జట్టు యాజమాన్యం చివరి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.
యువకులు రెడీగా ఉన్నారు..
తాజాగా కాన్పూర్ టెస్టులోనూ రహానే, పుజారా విఫలమయ్యారు. దీంతో ముంబయి టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన నేపథ్యంలో ఎవరిని పక్కనపెడతారనే విషయం ఆసక్తి రేపింది. ఈ క్రమంలోనే ఆ సందేహాలకు తెరదించుతూ రెండో టెస్టులో జట్టు యాజమాన్యం రహానేను పక్కనపెట్టింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తుండటం వల్ల జట్టులో ఒకసారి చోటు కోల్పోతే మళ్లీ స్థానం సంపాదించడం కష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సరిగ్గా ఆడని వారిని తొలగించి నైపుణ్యమున్న యువకులకు అవకాశాలు కల్పించాలని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, దక్షిణాఫ్రికా లాంటి విదేశీ పిచ్‌లపై అనుభవం లేని యువకులను ఆడించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్షన్ ప్యానెల్ కూడా ఆసక్తి చూపకపోవచ్చు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనలో రహానే, పుజారాలకు చివరి అవకాశం ఇచ్చి చూడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.