టెస్టు సిరీస్‌ను కోల్పోయి, కనీసం వన్డే సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోన్న టీమ్‌ఇండియా కీలకమైన రెండో వన్డేలో శుక్రవారం దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉన్న నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్ రాహుల్‌కు ఇది పెద్ద పరీక్షే. టెస్టు కెప్టెన్సీని ఆశిస్తున్న అతడు ఆ కోరిక నెరవేరాలంటే నాయకత్వ పటిమను చాటుకోవాల్సి ఉంది.
సారథిగా ఇప్పటిదాకా కాస్తయినా కేఎల్ రాహుల్ ఆకట్టుకోలేకపోయాడు. అతడు బ్యాట్‌తోనూ విఫలమవడం వల్ల తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను సరిగా ఉపయోగించుకోనందుకు అతడు విమర్శల పాలయ్యాడు. శార్దూల్ ఠాకూర్, చాహల్‌ను దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ బాదేస్తున్నా.. వెంకటేశ్‌కు ఒక్క ఓవర్ బౌలింగ్ కూడా ఇవ్వలేదు. రాహుల్ ఒక్క బౌలింగ్ మార్పు కూడా సరిగా చేయలేకపోయాడన్నది మరో విమర్శ. ఈ మ్యాచ్‌లో అతడు జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
మిడిల్ సమస్య: తిరిగి గెలుపు బాట పట్టాలనుకుంటున్న టీమ్‌ఇండియాకు పెద్ద సమస్య మిడిల్ ఆర్డర్ పేలవ ఫామే. కోహ్లీ హయాం నుంచీ ఇది అపరిష్కృత సమస్యగానే ఉంది. తొలి మ్యాచ్‌లో ఓ దశలో సాఫీగా లక్ష్యం దిశగా సాగిన భారత్‌ను మిడిల్ ఆర్డర్ వైఫల్యం దెబ్బతీసింది. షార్ట్ పిచ్‌లను ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ బలహీనత తొలి వన్డేలో మరోసారి బయటపడింది. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. చాలా అవకాశాలు దొరకడం కష్టమే. కాబట్టి ఈ కొన్ని అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పంత్, ఇద్దరు అయ్యర్‌లు పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో భారత్ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. కానీ బౌలింగ్ కూడా మెరుగుపడడం భారత జట్టుకు చాలా అవసరం.
తొలి వన్డేలో పరాజయం ఖాయమయ్యాక అర్ధసెంచరీ కొట్టినప్పటికీ.. శార్దూల్ ఠాకూర్ బౌలర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. బ్యాట్స్‌మెన్‌పై ఏమాత్రం ఒత్తిడి తేలేకపోయిన అతడు ధారాళంగా పరుగులిచ్చాడు. చాలా చెత్త బంతులు వేశాడు. భువనేశ్వర్ కుమార్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. వీళ్లు ఏ మేర పుంజుకుంటారో చూడాలి. స్పిన్నర్ల పరిస్థితీ భిన్నంగా ఏమీలేదు. తొలి మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య తేడా స్పిన్నర్లే. మంచి టర్న్ లభించినా భారత స్పిన్నర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయారు. అశ్విన్, చాహల్ 20 ఓవర్లలో 106 పరుగులిచ్చి ఒకే వికెట్ పడగొట్టగా.. మార్‌క్రమ్, షంసి, కేశవ్ 26 ఓవర్లలో 124 పరుగులిచ్చి, 4 వికెట్ల పడగొట్టి ఆతిథ్య జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అశ్విన్, చాహల్ ఈ మ్యాచ్‌లోనైనా ప్రత్యర్థిని తిప్పేస్తారేమో చూడాలి. బ్యాటింగ్‌లో ధావన్, కోహ్లీ ఫామ్ భారత్‌కు సానుకూలాంశం.
దక్షిణాఫ్రికా జోరుగా..: పర్యటనను భారతే ఫేవరెట్‌గా ఆరంభించినా.. అద్భుతంగా పుంజుకుని ఆ జట్టునే ఒత్తిడిలోకి నెట్టిన దక్షిణాఫ్రికా చాలా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. రెట్టించిన విశ్వాసంతో ఉంది. పెద్దగా సూపర్‌స్టార్లు లేకున్నా సమష్టిగా రాణిస్తోంది. తొలి వన్డేలో సెంచరీలతో మెరిసిన వాండర్‌డసెన్, కెప్టెన్ బవుమా అదే జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. బౌలింగ్‌లో ఆ జట్టుకు ఇబ్బందులేమీ లేవు. స్పిన్నర్లు, పేసర్లు చక్కగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కూడా తుది జట్టులో ఎలాంటి మర్పులు చేయకపోవచ్చు.
పిచ్, వాతావరణం..
పార్ల్‌లో వేడి ఎక్కువే. పిచ్ మందకొడిగా ఉంది. ఇప్పటికే స్పిన్‌కు సహకరిస్తోంది. వేడి వల్ల పిచ్ మరింత పొడిగా మారే అవకాశముంది. తొలి వన్డేలో లాగే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలే మెండు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!