Ashwin Kapil Test record: దక్షిణాఫ్రికాలో సత్తా చాటేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి సెంచూరియన్‌లో తొలి టెస్టు ఆడనుంది. ఈ సందర్భంగా పలు రికార్డులు మన బౌలర్లను ఊరిస్తున్నాయి.
దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ రికార్డుపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురిపెట్టాడు. వికెట్ల వేటలో ఇప్పటికే మాజీ స్పిన్నర్ హర్భజన్ రికార్డును అధిగమించిన అశ్విన్.. ఈ టెస్టు సిరీస్‌లో కపిల్ రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తున్నాడు.
ఒకే సిరీస్‌లో రెండు రికార్డులు!
ఇప్పటివరకు 81 టెస్టులాడిన అశ్విన్ 427 వికెట్లు తీసి, హర్భజన్(417)ను అధిగమించాడు. ఇప్పుడు సఫారీలతో టెస్టు సిరీస్‌లో కపిల్‌దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. అశ్విన్ ఈ రికార్డుకు కేవలం ఎనిమిది వికెట్లు దూరంలో ఉన్నాడు. ఇదే సిరీస్ సఫారీ మాజీ పేసర్ డేల్ స్టెయిల్ను(439) కూడా అధిగమించే అవకాశముంది. ఈ సిరీస్‌లో 14 వికెట్లు తీస్తే ఇద్దరి రికార్డులను అశ్విన్ అధిగమించవచ్చు.
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619), మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. అశ్విన్, భజ్జీ తర్వాత రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
5 వికెట్ల దూరంలో షమి..
Shami test record: భారత్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి కూడా ఈ టెస్టు సిరీస్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ మార్క్‌కు కేవలం ఐదు వికెట్ల దూరంలోనే ఉన్నాడు. టీమ్ఇండియా తరఫున ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి... 195 వికెట్లు పడగొట్టాడు. కపిల్‌దేవ్, జహీర్‌ఖాన్(311), ఇషాంత్ శర్మ(311), జవగల్ శ్రీనాథ్(236) మాత్రమే టెస్టు క్రికెట్లో 200కుపైగా వికెట్లు పడగొట్టిన పేసర్లుగా రికార్డు సృష్టించారు.
చరిత్ర తిరగరాయాలని..
IND Vs SA: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు ఈసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకునే సువర్ణావకాశం వచ్చింది. ఇప్పటి వరకు విదేశాల్లో టీమ్ఇండియా టెస్టు సిరీస్‌ను గెలవని ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. ఇప్పటివరకు ఏడుసార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఆరుసార్లు ఓటమిని చవిచూసింది. 2010-11 సంవత్సరంలో తొలిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆఫ్రికన్ గడ్డపై టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో భారత జట్టు సఫమలైంది. మూడేళ్ల క్రితం కోహ్లీ కెప్టెన్సీలో భారత్ చివరిసారిగా ఆ దేశంలో పర్యటించింది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.
దీంతో ఈ టెస్టు సిరీస్‌లో గెలిచి.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది టీమ్ఇండియా. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
ఇవీ చూడండి: