IND Vs SA 2nd Test Rohit Sharma : కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ బుధవారం మధ్యాహ్నామే ప్రారంభం కానుంది. తొలిటెస్ట్‌లో ఘోర పరభవాన్ని మరిచి సిరీస్‌ను సమం చేయడంపై దృష్టి పెట్టింది భారత్. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ ముంగిట ఓ అరుదైన రికార్డు ఉంది. అదేంటంటే?
దక్షిణాఫ్రికాతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీమ్‌ఇండియా టెస్టు సిరీస్ గెలవలేదు. ఈసారి కూడా సొంతం చేసుకునే అవకాశం లేదు. కానీ, సిరీస్‌ను డ్రా చేసుకొనేందుకు మాత్రమే ఛాన్స్ ఉంది. ఇలా చేస్తే సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు. ఇంతకు ముందు ఎంఎస్ ధోనీ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో ఓ సారి సిరీస్‌ను సమం చేసుకుంది.
2010-11 సీజన్‌లో మిస్టర్ కూల్ కెప్టెన్సీలో టెస్టు సిరీస్‌ను 1-1తో ముగించింది టీమ్‌ఇండియా. ఆ జట్టుతో జరిగిన మొత్తం ఎనిమిది సిరీసుల్లో ఏడింట్లో(1992-93, 1996-97, 2001-02, 2006-07, 2013, 2018, 2021-22) భారత్ ఓటమిపాలైంది. తాజాగా జరుగుతున్న ఈ సిరీస్‌ను కనీసం డ్రా చేసినా సిరీస్ ఓటమి నుంచి బయటపడొచ్చు. కేప్ టౌన్‌లో బౌలర్లు, బ్యాటర్లకు కఠిన సవాల్ ఎదురు కానుంది.
"సెంచూరియన్ పిచ్‌కు కాస్త దగ్గరగా కేప్ టౌన్ పిచ్ పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మేం గతంలో ఆడిన అనుభవం ఉంది. తొలి టెస్టులో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని బరిలోకి దిగుతాం. సవాళ్లు ఎదురైనా విజయం కోసం పోరాడతాం. మొదటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగలిగాం. కానీ బౌలింగ్‌లో వెనుకబడ్డాం. ఈసారి అలా జరగకుండా చూసుకుంటాం" అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
''తుదిజట్టు విషయానికొస్తే ఇంకా ఖరారు కాలేదు. దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మా జట్టులో అనుభవం లేని పేసర్లు ఉన్నారు. కానీ జట్టుగా మేం వారిపై నమ్మకం ఉంచాలి. తొలి టెస్టు ముందు ప్రెస్ మీట్‌లో చెప్పిన మాటలకీ ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ప్రసిద్ధ్ కృష్ణ మంచి సామర్థ్యం ఉన్న బౌలర్. అది అతడి తొలి టెస్టు మాత్రమే. మొదటి మ్యాచ్‌లో ఎవరైనా కాస్త ఇబ్బంది పడతారు'' అని రోహిత్ తెలిపాడు. ప్రసిద్ధ్ స్థానంలో ముకేశ్‌ను తీసుకోవాలని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సమమా? సమర్పణమా?- సఫారీలతో రెండో టెస్ట్‌కు భారత్ రెడీ- తుది జట్ల వివరాలివే!