Ind Vs Pak World Cup 2023 : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్.. భారత్ వేదికగా ప్రారంభమైంది. అయితే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 14వ తేదీన.. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్డేడియం వేదికగా జరగనున్న దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు.
India Pakistan Match World Cup : ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని అన్ని హోటళ్లుకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కసారిగా హోటల్ గదుల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది.
Ind Pak World Cup 2023 Date : భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది భారతీయ రైల్వే. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలు భారీగా పెరగడం, అధిక విమాన టికెట్ ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
Ind Pak Match 2023 : అక్టోబర్ 14వ తేదీన మ్యాచ్ ప్రారంభం కావడానికి కొన్నిగంటల ముందు ఈ ప్రత్యేక రైళ్లు సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయని తెలిపారు. ఈ రెండు స్టేషన్లు నరేంద్ర మోదీ స్టేడియానికి దగ్గరగా ఉండటం వల్ల అభిమానులు సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చని వివరించారు. మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల తర్వాత ఈ రైళ్లు అహ్మదాబాద్ నుంచి తిరిగి బయల్దేరుతాయని, దాని వల్ల అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.