ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా తొలి సెషన్ ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులతో నిలిచింది. క్రీజులో ఛెతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(6) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్ తలో వికెట్ తీసుకున్నారు.
శుభారంభం..
వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన శుభారంభం చేసింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(68 బంతుల్లో 34), శుభ్‌మన్ గిల్(64 బంతుల్లో 28).. 62 పరుగులు జోడించారు. కుదురుకుంటున్నట్టే కనిపించిన ఈ జంటను జేమీసన్ విడగొట్టాడు. రోహిత్‌ను స్లిప్‌లో దొరకబుచ్చుకున్నాడు. గిల్ కూడా వికెట్‌కీపర్‌కు చిక్కాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా.
నల్ల బ్యాండులతో..
అంతకుముందు జాతీయ గీతం పాడుతూ టీమ్ఇండియా ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండులతో కనిపించారు. దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించి, ఈ మ్యాచ్ ఆడనున్నారు.