IND vs NZ Test 2021: కాన్పూర్ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యం సాధించడంలో అక్షర్ పటేల్ (5/62) కీలక పాత్ర పోషించాడు. ఇతడి ఐదు వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను 296 పరుగులకే టీమ్‌ఇండియా కట్టడి చేయగలిగింది. ఈ సందర్భంగా తన ప్రదర్శనపై అక్షర్ పటేల్ మాట్లాడుతూ తన బేసిక్స్‌కు కట్టుబడి బౌలింగ్ చేశానని తెలిపారు.
"ఆరంభం ఈ విధంగా ఉండాలని భావించా. టెస్టు క్రికెట్ అంత సులభం కాదు. ఇవాళ చాలా కష్టమైన రోజు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఎలాంటి వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ప్రారంభించింది. అప్పటికే ఓపెనర్లు క్రీజ్‌లో కుదురుకుని పోయారు. ఇలాంటి సందర్భంలో ప్రతి బంతికి వికెట్ తీద్దామని కాకుండా ఓపిగ్గా బౌలింగ్ చేయాలని జట్టు సభ్యులం మాట్లాడుకున్నాం. నా బేసిక్స్‌కు కట్టుబడి బౌలింగ్ చేశా. క్రీజ్‌ను కూడా అనుకూలంగా మార్చుకుని ఉపయోగించుకోవడం వల్ల వికెట్లు దక్కాయి. ట్రాక్ ఎంతో నెమ్మదించింది. ఇవాళ టర్న్ అవుతోంది. అప్పుడప్పుడు బౌన్స్ కూడా అవుతోంది. దాన్ని వినియోగించుకుని రౌండ్ ఆర్మ్ డెలివరీలు సంధించా. అయితే క్రీజ్‌లో బ్యాటర్లు కుదురుకుంటే మాత్రం పరుగులు వస్తాయని ఇప్పటికీ నమ్ముతున్నా."
-అక్షర్ పటేల్, టీమ్ఇండియా స్పిన్నర్
Axar Patel Test Wickets: ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు దక్కించుకుని అత్యంత వేగంగా ఐదుసార్లు ఈ ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు అక్షర్ పటేల్. ఆడిన నాలుగు టెస్టుల్లో ఐదుసార్లు ఐదు వికెట్లు తీసి తన సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పాడు.