Shane Warn slams Team India Decision: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు చివరి సెషన్‌లో టీమ్‌ఇండియా తీరుకు స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సోమవారం ఐదో రోజు ఆటలో న్యూజిలాండ్ చివరి వికెట్ కాపాడుకొని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. అయితే, ఇన్నింగ్స్ 81వ ఓవర్ పూర్తయ్యాక టీమ్ఇండియా కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా నాలుగు ఓవర్లు ఆలస్యంగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. తర్వాత జడేజా కొత్త బంతితో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే రెండు వరుస ట్వీట్లు చేసిన షేన్‌వార్న్ భారత జట్టు ఆలోచనా విధానాలు తనను చాలా ఆశ్చర్యానికి గురిచేయాని చెప్పాడు.
"భారత జట్టు కొత్త బంతిని తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలేదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. వెలుతురు సరిగ్గా లేని పరిస్థితుల్లో, ఓవర్లు పూర్తవుతున్న క్రమంలోనూ పాత బంతితోనే బౌలింగ్ చేస్తోంది. ఇది విచిత్రంగా ఉంది" అంటూ మ్యాచ్ జరుగుతుండగానే ఒక పోస్టు చేశాడు.
కాసేపటికే మరో ట్వీట్‌లో.."ముందే కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా.. అదే పాత బంతితో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందా..? న్యూజిలాండ్ వెనుకపడుతుందా? లేక ఇండియా గెలుస్తుందా?" అని తన సందేహాలను వెలిబుచ్చాడు.
కాగా, టీమ్‌ఇండియా ఆఖరి క్షణాల్లో ఒక్క వికెట్ తీసేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను నిలిపివేశారు. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది.