న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేను చివరి వరకూ పోరాడి గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది టీమ్ఇండియా. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమ్ఇండియాకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మిగతా టీమ్ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత పెట్టింది.
తొలి వన్డేలో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే టీమ్ఇండియా మూడు ఓవర్లు తక్కువగా వేసింది. ఒక ఓవర్‌కు 20 శాతం మ్యాచ్ ఫీజు కోత పెడతారు. ఆ లెక్కన మూడు ఓవర్లు కావడంతో 60 శాతం జరిమానా విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. "న్యూజిలాండ్‌తో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ఇండియా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించాం. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ ఈ జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసినట్లు గుర్తించారు" అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో దీనిపై విచారణ అవసరం లేదని తెలిపింది. తొలి వన్డేలో గెలిచిన తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. శనివారం రాయ్‌పుర్‌లో జరగబోయే రెండో వన్డే కూడా గెలిచి సిరీస్ ఎగరేసుకుపోవాలని చూస్తోంది.
తొలి వన్డేలో 350 పరుగుల ఛేజింగ్‌లో న్యూజిలాండ్ టాప్ఆర్డర్ విఫలమైంది. అయితే చివర్లో బ్రాస్‌వెల్, సాంట్నర్ పోరాడటంతో లక్ష్యానికి దగ్గరగా వచ్చింది. ఒక దశలో కివీస్ గెలుస్తుందని అందరూ భావించారు. చివరి ఓవర్లో 20 రన్స్ అవసరం కాగా.. తొలి బంతికే బ్రాస్‌వెల్ సిక్స్ కొట్టాడు. అయితే తర్వాత బంతికే శార్దూల్ ఠాకూర్ ఓ యార్కర్‌తో అతడిని ఔట్ చేయడంతో భారత్ జట్టు విజయం సాధించింది.