టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ 205 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రస్తుతానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ జోరూట్(33) ఉన్నాడు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. టీమ్ఇండియా బౌలర్లు బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మ అదరగొట్టారు. దీంతో రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. తొలి ఓవర్లో బుమ్రా.. బర్న్స్‌ను ఔట్ చేయగా రెండో ఓవర్లో షమీ.. సిబ్లీ(0)ని పెవిలియన్ పంపాడు. ఫలితంగా 2 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 3/2గా నమోదైంది. ఆ తర్వాత ఇషాంత్ వేసిన 15.3 ఓవర్లో హమీద్(9) 44 పరుగుల వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఇషాంత్ బౌలింగ్‌లోనే 21వ ఓవర్ చివరి బంతికి బెయిర్‌స్టో (2) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 22 ఓవర్లకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.
అంతకుముందు టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 298/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 391 పరుగులకు ఆలౌటయ్యాక.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరికి ఆతిథ్య జట్టు ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ కవ్వింపులు.. కోహ్లీ ఫైర్!