ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా బాగా రాణించారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ (75*), రవీంద్ర జడేజా (45*) పోరాటం భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దీంతో టీమ్‌ఇండియా 1-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇప్పుడిదే జోష్‌తో వైజాగ్ వేదికగా మార్చి 19న జరగనున్న రెండో వన్డే కోసం భారత క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. వైఎస్ రాజశేఖర్ మైదానం వేదికగా ఆదివారం కంగారులతో రెండో వన్డేలో రోహిత్ సేన తలపడనుంది. ఇప్పటికే తొలి వన్డేలో మంచి ప్రదర్శన చేసిన భారత్ జట్టు.. రెండో మ్యాచ్‌లోను మంచిగా రాణించాలని పట్టుదలతో ఉంది. అలాగే ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. తదుపరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కసితో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అభిమానులకు ఓ శుభవార్త అందింది. తన బావ మరిది పెళ్లి కోసం తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని తెలిసింది. ఈ విషయం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక ఇక్కడి పిచ్‌కు భారత్‌కు అనుకూలంగా ఉంటుంది.
మరి రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడి తన స్థానాన్ని కాపాడుకున్నాడు. దీంతో ముంబయి మ్యాచ్‌లో ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరిపై వేటు తప్పదని తెలుస్తోంది. అయితే సీనియర్ అయిన సూర్యకుమార్‌కు మరో ఛాన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇషాన్ కిషన్‌పై వేటు తప్పదు! ఇక సూర్యకుమార్ ఈ రెండో మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయాల్సిన బాధ్యత ఉంది. టీ20 ఫార్మాట్లో చెలరేగిపోయే అతడు.. వన్డేలో మాత్రం సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తొలి వన్డేలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిపై సోషల్‌మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. దీంతో వైజాగ్ వన్డే మ్యాచ్ అతడికి ఎంతో కీలకం కానుంది. ఒకవేళ ఇందులో కూడా విఫలమైతే అతడి స్థానంలో మరో ప్లేయర్ రావొచ్చు. ఇక ఐదో స్థానంలో.. ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టిన కేఎల్ రాహులే బరిలోకి దిగుతాడు. ఆరు, ఏడు స్థానాల్లో హార్దిక్, రవీంద్ర జడేజా కూడా మంచిగానే రాణిస్తారు. కాబట్టి బ్యాటింగ్ విభాగంలో వీరంతా తమ జోరును కొనసాగిస్తే.. మంచి స్కోరు చేయొచ్చు.
బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులేమి ఉండకపోవచ్చు. ఇప్పటివరకు టీమ్‌లో ఉన్న నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే రెండో వన్డేలో రోహిత్ సేన బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.. ఆల్‌రౌండర్లు హార్దిక్, శార్దూర్ ఠాకూర్, జడేజా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. అయితే తొలి మ్యాచ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వికెట్ తీసినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకోవడంతో అతడిని ఇప్పుడు ఆడిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. అతడి స్థానంలో చాహల్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఐపీఎల్ అందాల యాంకర్లు.. వీరు మైదానంలో ఉంటే ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు