విశాఖ వన్డేలో టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆసీస్ బౌలర్ల ధాటికి 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్‌కోహ్లీ 31 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో సత్తా చాటాడు.
సీన్ అబాట్‌కు 3, నాథన్ ఎల్లిస్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 66, ట్రావిస్ హెడ్ 51 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో ఆస్ట్రేలియా సమం చేసింది. బుధవారం చెన్నైలో జరిగే మూడోవన్డే నిర్ణయాత్మకంగా మారింది.
బ్యాటింగ్‌లోనూ బౌలింగ్‌లోనూ ఫైర్..
ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆసిస్ టీమ్ తమ ఓపెనర్లతోనే ఆటను ముగించింది. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అనూహ్య మార్పు జరిగింది. కేవలం 11 ఓవర్లలోనే 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఆసిస్ టీమ్. దీంతో విజయం ఆసిస్ టీమ్‌ను వరించింది. ఓపెనర్లుగా దిగిన ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ బరిలోకి దిగగా వారికి షమీ బౌలింగ్ వేశాడు. అయితే తొలి రెండు ఓవర్లకే 13 పరుగులు ఇచ్చేశాడు. దీంతో కంగారు జట్టు చెలరేగిపోయింది. ఇక ట్రావిస్, మిచెల్ పోటీ పడి మరీ బాల్‌ను బాదేశారు. కేవలం ఆరు ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 66 పరుగులను సాధించారు. మిచెల్ మార్ష్, ట్రావిస్ అర్థ శతకాన్ని స్కోర్ చేసి సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ (51*), (66*) స్కోర్లతో పని పూర్తి చేశారు.
ఇలా చేశావేంటి స్కై..
టీ20ల్లో విజృంభించే సూర్య కుమార్ యాదవ్.. వన్డేల్లో మాత్రం ఎందుకో వెనకడుగేస్తున్నాడు. ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో గోల్డన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టిన స్కై.. రెండో మ్యాచ్‌లోనూ తొలి బంతికే ఔటయ్యాడు. జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఎల్బీ రూపంలోనే సూర్య ఔటవ్వడం గమానార్హం. ఇక ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాకుండా గత సిరీస్‌లలోనూ అంతంత మాత్రంగానే స్కోర్ చేశాడు. గతంలో జరిగిన పది వన్డే మ్యాచ్‌ల్లో వరుసగా 13, 9,8, 4, 34, 6, 4, 31, 14 , 0 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. ఒక్క ఇన్నింగ్స్‌లోనూ అర్థశతకాన్ని కూడా సాధించలేకపోయాడు. దీంతో అతని స్థానాన్ని సంజూ శాంసన్‌కు ఇవ్వాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.