బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వర్సెస్ టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి.. వీరిద్దరూ అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శాస్త్రి.. దాదాకు తనకు మధ్య మనస్పర్థలు ఏమీ లేవని చెప్పాడు. గతంలో జరిగిన బస్ సంఘటన గురించి మాట్లాడాడు.
ఒకరోజు ఆలస్యంగా వచ్చినందుకు జట్టు ప్రయాణం చేసే బస్సులో గంగూలీని ఎక్కనివ్వలేదు రవిశాస్త్రి. ఇదే విషయం గురించి దాదాను మీడియా ప్రశ్నించగా "అలాంటిదేమీ లేదు. అయినా మీరు రవిశాస్త్రిని ఉదయాన్నే ఇంటర్వ్యూ చేయొద్దు. సాయంత్రం చేయండి" అన్నాడు. తాజాగా ఈ విషయం గురించి శాస్త్రిని అడగగా.. "అతడితో నాకు మనస్పర్థలు లేవు. ఎవరికోసం బస్సు ఆగదు. అది ఎవరైన సరే. ఆ రోజు గంగూలీ ఉన్నాడంటే" అని సమాధానమిచ్చాడు.
'బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా మీకు వ్యతిరేకమా?' అని అడగగా.. "అలాంటిదేం లేదు. అతడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు తనతో మాట్లాడా. దాదా ఆటను చాలా చూశాను. మేమిద్దరం ఒకే జట్టు(టాటా స్టీల్)కు ఆడాం. ఆ జట్టుకు నేను కెప్టెన్గా వ్యవహరించినప్పుడు నా సారథ్యంలో అతడు ఆడాడు. చాలా కాలం కలిసి ఉన్నాం"అని బదులిచ్చాడు శాస్త్రి.
"మీడియాకు ఇలాంటి స్టోరీస్ (బేల్ పూరి, చాట్ స్టోరీలు) అంటే ఇష్టం. దానిమీద చక్కగా మసాలా జల్లుతారు. నేను కూడా ఇలాంటివి ఇష్టపడతా" అని మీడియాపై శాస్త్రి వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.
ఇదీ చూడండి: బయోపిక్కు గంగూలీ ఓకే.. ప్రధాన పాత్రలో ఆ హీరో!