పేలవ ఫామ్‌తో పరుగులు చేయలేకపోతున్న విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కొంతమంది కోహ్లీని పక్కన పెట్టాలని వాదిస్తున్నారు. అయితే చాలామంది విరాట్ తిరిగి ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాడు గావస్కర్ ఉన్నారు. అవసరమైతే.. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడానికి తనకు తెలిసిన సలహాలు ఇస్తానని చెప్పారు. తాను ఒక 20 నిమిషాలు మాట్లాడితే.. తాను చెప్పే మాటలు అతడికి ఉపయోగపడొచ్చని చెప్పుకొచ్చారు.
"నేను విరాట్‌తో 20 నిమిషాలు వెచ్చిస్తే.. అతడు చేయాల్సిన పనులను చెబుతా. కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పలేను. కానీ.. ఆ సలహాలు అతడికి సాహాయపడుతాయి."
- గావస్కర్, దిగ్గజ ఆటగాడు
విరాట్ కోహ్లీ.. ఈ మధ్య కాలంలో ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్‌కు అవతల వైపునకు వెళ్తున్న బంతులను ఆడి వికెట్ పోగొట్టుకుంటున్నాడు. ఒకరకంగా అతనికి అది ఒక వీక్నెస్ మారిందనే చెప్పాలి. ఈ ఇబ్బందిని ఎలా అదిగమించాలో తాను చెబుతానని అన్నారు గావస్కర్. ఒకప్పుడు ఒక ఓపెనింగ్ బ్యాటర్‌గా అలాంటి బంతులను ఆడటంలో ఇబ్బందులు పడినవాడిగా.. తనకు తెలిసిన సలహాలను కోహ్లీకి చెబుతానని వివరించారు.
'ఆఫ్ స్టంప్ ఆవల బంతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలంగా పరుగులు చేయలేకపోవడంతో ప్రతి బంతిని ఆడాలని భావిస్తున్నాడు. అందుకే బౌలర్లకు దొరికిపోతున్నాడు' అని గావస్కర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హార్దిక్ పాండ్య.. టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా ఆశాకిరణం