పోటీతత్వమే తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసుకొస్తోందని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అన్నాడు. నేర్చుకోవడం ఆపేసినప్పుడు ఆట నుంచి తప్పుకొంటానని పేర్కొన్నాడు. ఏదో ఒకటి సరికొత్తగా నేర్చుకోవాలన్న తపనే తన కెరీర్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని వెల్లడించాడు.
"కెరీర్ సాగుతున్న కొద్దీ పరిపూర్ణత కోసం ప్రయత్నించడమే టెస్టు క్రికెట్లోని అందం. నిత్యం నేర్చుకొనేందుకు ప్రేరణ కల్పిస్తుంది. ఆ తత్వమే నా కెరీర్‌లో ఇన్ని విజయాలు సాధించేందుకు ఉపయోగపడింది. నేను ఏదో ఒక బిందువు వద్ద ఆగిపోలేదు. నిరంతరం మెరుగు పరుచుకొనేందుకే ప్రయత్నించా. భిన్నంగా ప్రయత్నించడం ఇష్టం లేనప్పుడు, కొత్తవి నేర్చుకొనే సహనం నశించినప్పుడు ఆడటం మానేస్తా."
-అశ్విన్, టీమ్ఇండియా స్పిన్నర్
సాధారణంగా అశ్విన్ స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేస్తుంటాడు. మరీ విమర్శలకు పోకున్నా బలంగా తన అభిప్రాయం చెప్తాడు. "వివాదాలు నాకేమీ ఇష్టంకాదు. పోరాటాన్ని నేనిష్టపడతా. నిజానికి ఆ తత్వం వల్లే నేనిక్కడున్నా. విజయాలకు ఎక్కువగా పొంగిపోను. ఎందుకంటే విజయమనేది ఒక సంఘటన. సాధన, ప్రణాళికతో అది సాధ్యమవుతుంది. ప్రతిసారీ ఇంకా మెరుగ్గా ఏం చేయాలనే ఆలోచిస్తా" అని యాష్ పేర్కొన్నాడు.
"నిజాయతీగా చెప్పాలంటే నా ప్రదర్శనలపై కథనాలను నేను పట్టించుకోను. నేను నాలాగే ఉంటా. భారత్‌లో అతిగా పొగిడేస్తారు. కానీ నేనో సాధారణ వ్యక్తిని. క్రికెట్ ఆడుతూ మనశ్శాంతి, ఆనందం పొందుతాను. ఆట ఆడుతూ నా కుటుంబాన్ని పోషించుకోవడమే నాకు ఆనందం. నాకు బాగానే చెల్లిస్తున్నారు. క్రికెట్ ఆడటం వల్లే నా జీవితానికి ఒక అర్థం వస్తోంది. అందుకే నేను ఆసక్తిగా, ఆనందంగా ఉంటాను. ఎవరు పొగిడినా, తిట్టినా పట్టించుకోను. నా జీవితం నాది" అని అశ్విన్ వెల్లడించాడు.