ఫార్మాట్ ఏదైనా ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నీ.. ముఖ్యంగా అగ్రశ్రేణి జట్లన్నీ ఒకేసారి.. ఒకేచోట కొలువుదీరితే ఆ సంబరమే వేరు. హోరాహోరీ పోరాటాలతో ఒక్కో దశ దాటుతూ ఆఖరి పోరాటంలో ప్రపంచకప్పు సాధిస్తే ఆ మజానే వేరు. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో అలాంటి చిరస్మరణీయ ఘట్టాల్ని ఎన్నో చూశాం. లెక్కలేనన్ని మధురానుభూతుల్ని మదినిండా దాచుకున్నాం! వన్డేలకు ఘనమైన చరిత్రే ఉండగా.. టీ20లు క్రికెట్ రైలుకు ఇంజన్‌లా మారిపోయాయి. కానీ క్రికెట్‌కు అసలైన నిర్వచనం మాత్రం ముమ్మాటికీ టెస్టులే!
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో ప్రపంచకప్ లేకపోడానికి సమయం.. సమన్వయం.. పర్యవేక్షణ.. నిర్వహణ.. ఆతిథ్యం సహా ఎన్నో సహేతుక ఇబ్బందులే ఉండొచ్చు! ఆలస్యంగానైనా అయిదు రోజుల ఆటకు పట్టంగట్టింది ఐసీసీ. ప్రతి ఫార్మాట్‌లో ప్రపంచకప్ ఉండాలన్న ధ్యేయం.. అయిదు రోజుల ఆటకు ఆదరణ, పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పురుడు పోసుకుందే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ). ప్రారంభం కాకుండానే రెండు మార్లు రద్దయిన డబ్ల్యూటీసీ ఎట్టకేలకు 2019లో పట్టాలకెక్కింది. రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మొదటి మెగా ఫైనల్‌కు ముస్తాబైంది. క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లాండ్ వేదికగా.. ప్రపంచ నంబర్‌వన్ టీమ్‌ఇండియా, నంబర్‌టూ న్యూజిలాండ్ మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడుతూ టెస్టుల్లో సరికొత్త చరిత్రకు నాంది పలకనున్నాయి.
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్
ప్రత్యర్థులు: భారత్ x న్యూజిలాండ్
తేదీ: జూన్ 18 నుంచి 22 వరకు
వేదిక: సౌథాంప్టన్ (ఇంగ్లాండ్)
అంతకుమించి..
'ఫార్మాట్‌కో కప్పు' అన్న ఆలోచన నుంచి పుట్టిందే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్! పేరులో కప్పు లేకపోయినా టెస్టు క్రికెట్లో అత్యున్నత టోర్నీ ఇదే. యాషెస్, ట్రాన్స్- టాస్‌మన్, రిచర్డ్స్- బోథమ్, బోర్డర్- గావస్కర్ సహా ఎన్నో ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక ట్రోఫీలు టెస్టు క్రికెట్లో ఉండొచ్చు. డబ్ల్యూటీసీ మాత్రం అంతకుమించి! టెస్టు హోదా ఉన్న తొమ్మిది దేశాలు రెండేళ్ల కాలంలో ఇంటా, బయటా తలపడి.. అంతిమంగా టెస్టు క్రికెట్ రారాజు ఎవరో తేల్చే మహా సంగ్రామం. 2009లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో తొలిసారిగా డబ్ల్యూటీసీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఐసీసీ, క్రికెట్ నియమావళి రూపకర్త మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) చర్చల అనంతరం డబ్ల్యూటీసీ నిర్వహిస్తే ఆటకు ఆదరణ పెరుగుతుందని భావించారు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో డబ్ల్యూటీసీని ప్రవేశ పెట్టాలని ఐసీసీ బోర్డు తీర్మానించింది. 10 టెస్టు జట్లు.. నాలుగేళ్ల కాల వ్యవధిగా నిర్ణయించారు. లీగ్ దశ అనంతరం, ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహించాలన్నది ఆలోచన. అయితే ఆర్థిక ఇబ్బందులు.. స్పాన్సర్లు, ప్రసారదారుతో ఉన్న ఒప్పందాల్లో సమస్యల కారణంగా డబ్ల్యూటీసీ నిర్వహించే ఆలోచనను 2011లో ఐసీసీ విరమించుకుంది. 2013-2017లో డబ్ల్యూటీసీని కచ్చితంగా నిర్వహిస్తామన్న ఐసీసీ మరోసారి వెనక్కి తగ్గింది. చివరికి 2019లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య యాషెస్ సిరీస్‌తో డబ్ల్యూటీసీ పురుడు పోసుకుంది. ఐర్లాండ్, జింబాబ్వే, అఫ్గానిస్తాన్ మినహాయించి టెస్టు హోదా కలిగిన మిగతా 9 జట్లు.. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ బరిలో నిలిచాయి.
2020లో కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య సిరీస్ రద్దవడం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కివీస్ రికార్డు సృష్టించింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా దర్జాగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇదీ చూడండి.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఒకే మ్యాచ్.. ఐసీసీ వివరణ