ICC Soft Signal : వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ నేపథ్యంలో ఆంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మైదానంలో ఎన్నో వివాదాలకు కారణమైన 'సాఫ్ట్ సిగ్నల్' నిబంధనను తొలగించింది. అయితే ఇదివరకు క్రికెట్లో క్యాచ్ ఔట్ల విషయంలో చాలా సార్లు ఈ సాఫ్ట్ సిగ్నల్ అంశం వివాదంగా మారింది. ఈ సాఫ్ట్ సిగ్నల్ నిబంధన కారణంగా ఎన్నో మ్యాచ్‌ల ఫలితాలు మారాయి. ఈ విషయమై పలు దేశాల క్రికెట్ బోర్డులు ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. పలు దఫాల చర్చల అనంతరం ఈ వివాదాలకు ఇప్పుడు తెర పడింది. సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను తొలగించే ప్రతిపాదనకు సౌరభ్ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మ్యాచ్ జరుగుతున్నప్పుడు, గ్రౌండ్లో సహజంగా వెలుతురు తక్కువ అయినప్పుడు ఫ్లడ్ లైట్లను ఉపయోగించి ఆటను కొనసాగించేలా కూడా ఐసీసీ మార్పులు తెచ్చింది.
ఇంతకీ ఎంటా సాఫ్ట్ సిగ్నల్ నిబంధన.. మ్యాచ్‌లో బ్యాటర్ ఔట్ అయిన విధానం పట్ల ఫీల్డ్ అంపైర్‌కు సందేహం ఉంటే థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తాడు. అయితే ఇది మామూలే. కానీ ఫీల్డ్ ఫీల్డ్ అంపైర్ అలా థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసేటప్పుడు.. అది ఔట్? నాటౌట్? అని ఎదైనా ఒకటి తన నిర్ణయంగా సాఫ్ట్ సిగ్నల్ రూపంలో చెప్పాలి. అలా ఫీల్డ్ అంపైర్ తన అభిప్రాయాన్ని థర్డ్ అంపైర్‌కు వెల్లడించటమే 'సాఫ్ట్ సిగ్నల్' నిబంధన. అయితే రివ్యూలో థర్డ్ అంపైర్‌కు స్పష్టత రానప్పుడు.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ను పరిగణలోకి తీసుకొనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు థర్డ్ అంపైర్. ఇలా చాలా సార్లు ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కు కట్టుబడి థర్డ్ అంపైర్ ప్రకటించిన తీర్పు పట్ల అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి.
హెల్మెట్ కంపల్సరీ.. దీంతో పాటు ఎక్కువ రిస్క్ ఉన్న స్థానాల్లో హెల్మెట్ ధరించాలనే నిబంధనను కంపల్సరీ చేసింది ఐసీసీ. బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు, వికెట్ కీపర్స్ స్టంప్స్ వెనుక ఉన్నప్పుడు, ఫీల్డర్లు బ్యాటర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని తెల్చిచెప్పింది. దీంతో పాటు ఫ్రీ హిట్ నిబంధనకు కొన్ని మార్పులు చేసింది. బంతి స్టంప్స్‌కు తాకినా.. ఫ్రీ హిట్లో స్కోర్ చేసిన పరుగులను పరిగణలోకి తీసుకుంటారు. ఈ మార్పులు 1 జూన్ 2023న ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరగబోయే టెస్టు మ్యాచ్‌లో అమలులోకి రానున్నాయి.
మ్యాచ్ డ్రాకు నో ఛాన్స్ .. జూన్ 7-11 మ్యాచ్ జరగనుండగా.. జూన్ 12వ తేదీని ఇదివరకే రిజర్వ్ డే గా ప్రకటించారు. ఈ రిజర్వ్ డేకు తోడు సాఫ్ట్ సిగ్నల్ తొలగింపు, ఫ్లడ్ లైట్లు ఉపయోగించటం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా గా ముగిసే అవకాశమే లేదంటున్నారు క్రీడా విశ్లేషకులు. భారత్, ఆస్ట్రేలియాల్లో ఏదో ఒక జట్టు కచ్చితంగా గెలుస్తుందని పలువురు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఒకవేళ ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే భారత్ - ఆస్ట్రేలియా జూన్ మధ్య పోరు మరింత ఉత్కంఠగా మారనుంది.
కాగా ఈ నెల ఆఖరి వారంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా టీమిండియా కీలక ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు పయనం కానున్నారు. ఛెతేశ్వర్ పుజారా ఇప్పటికే లండన్‌లో కౌంటీ ఛాంపియన్షిప్ టోర్నీ ఆడుతున్నాడు. టోర్నీలో ససెక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా ఇంగ్లాండ్ పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తున్నాడు.