కరోనా(Corona) నేపథ్యంలో టీ20 ప్రపంచకప్(T20 World cup)ను తమ దేశంలో నిర్వహించాలా లేదా అనేదానిపై భారతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఐసీసీ తాత్కాలిక సీఈఓ జెఫ్ అలార్‌డైస్(Geoff Allardyce) అన్నారు. కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం ఈ అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన ఈ కప్‌కు ఆతిథ్యం ఇవ్వాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐ ఈనెల 28 వరకు గడువు కోరింది.
"పూర్తి స్థాయిలో ప్రపంచకప్‌ను నిర్వహించాలన్నది మా ఆలోచన. కానీ ప్రణాళిక విషయంలోనే ఇంకా స్పష్టత లేదు. ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండడం వల్ల వేరే దేశాల్లో ప్రపంచకప్ నిర్వాహణ మరింత జటిలంగా మారింది. వేరే దేశాలకు వెళ్లాలన్నా ఎన్నో నిబంధనలు ఉన్నాయి. అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి.. బస చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ టోర్నీ జరుగుతుందనే దానిపైనే ఇదంతా ఆధారపడి ఉంది. మేం దీనిపై బీసీసీఐతో రోజూ చర్చిస్తున్నాం."
- జెఫ్ అలార్‌డైస్, ఐసీసీ తాత్కాలిక సీఈఓ
భారత్‌లో జరగకపోతే యూఏఈ లేదా ఓమన్‌లో టోర్నీ నిర్వహించొచ్చన్న ఆలోచనలో ఐసీసీ ఉంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల విధానంలో మార్పు..
మరోవైపు సర్వత్రా విమర్శలు రేగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల విధానాన్ని(WTC points system) మార్చాలని ఐసీసీ(ICC) భావిస్తోంది. వచ్చే డబ్ల్యూటీసీ టోర్నీ నుంచి పాత పాయింట్ల పద్ధతినే కొనసాగించాలనుకుంటున్నట్లు ఆలార్‌డైస్ చెప్పాడు. ప్రస్తుతం ఉన్న సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించే పద్ధతి స్థానంలో గతంలో ఉన్నట్లే ఏ మ్యాచ్‌కు ఆ మ్యాచ్ చొప్పున పాయింట్లు ఇవ్వాలనేది ఐసీసీ ఆలోచన.
కరోనా వల్ల చాలా సిరీస్‌లు రద్దు కావడం వల్ల శాతాల విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక జట్టు ఆడిన మ్యాచ్‌లు, ఆ జట్లు సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకుని పాయింట్లను కేటాయించి ర్యాంకులు ఇచ్చారు. దీని వల్ల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్లకు ఫైనల్ చేరే అవకాశాలకు గండిపడింది. రెండు మ్యాచ్‌లున్న భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌కు, నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు ఒకేలా పాయింట్లు కేటాయించడంపై విమర్శలొచ్చాయి.
ఇదీ చూడండి.. WTC Final: బౌలర్లతో కోహ్లీ.. బ్యాట్స్‌మెన్‌తో బుమ్రా!