ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)ను మూడు టెస్టులుగా నిర్వహించాలని పలువురు క్రికెటర్లు ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో ఐసీసీ(ICC) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్నందున అందుకు వీలుపడదని వెల్లడించింది. 'ఆదర్శనీయమైన ప్రపంచం'లో మాత్రమే అది సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.
"డబ్ల్యూటీసీ ఫైనల్‌ను మూడు టెస్టులుగా నిర్వహించాల్సి వస్తే క్రికెట్ ఆడే దేశాలన్నీ ఒక నెల రోజుల ఖాళీ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుత రద్దీ షెడ్యూల్ సమయంలో అది సాధ్యం కాదు. అందుకే ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్ మ్యాచ్‌ను ఒకే టెస్టుగా నిర్వహిస్తున్నాం."
-జియోఫ్ అలార్డిస్, ఐసీసీ తాత్కాలిక సీఈఓ.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రవేశపెట్టిన అర్హత విధానంపై సంతోషం వ్యక్తం చేశారు అలార్డిస్(Geoff Allardice). "కరోనా కారణంగా మధ్యలో పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చాం. దీనిపై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. కొన్ని జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాయి. మరికొన్ని జట్లు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడుతుంటాయని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందులో పెద్ద తేడా అనేది ఏమీ ఉండదు" అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఆ విషయంలోకి సెలెక్టర్లను అనవసరంగా లాగారు'