Women's World Cup Qualifiers: కరోనా కారణంగా జింబాబ్వే వేదికగా జరుగుతోన్న మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీని రద్దు చేసింది ఐసీసీ. ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తున్న కొత్త రకం వేరియంట్(Corona New Variant Omicron) కారణంగా పలు యూరప్ దేశాలు ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో పాటు జింబాబ్వేలోనూ న్యూ వేరియంట్ కేసులు వస్తున్న కారణంగా ఈ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ.
శనివారం జరగాల్సిన జింబాబ్వే-పాకిస్థాన్, యూఎస్ఏ-థాయ్‌లాండ్ మ్యాచ్‌లు యథావిధిగా ప్రారంభమవ్వగా.. శ్రీలంక-వెస్టిండీస్ మధ్య జరగబోయే మ్యాచ్‌కు మాత్రం కరోనా అడ్డంకిగా మారింది. లంక జట్టు సహాయ సిబ్బందిలో పలువురికి కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్ జరిగే వీలు లేకపోయింది. దీంతో పరిస్థితి తీవ్రంగా ఉందని గమనించిన ఐసీసీ.. ఈ క్వాలిఫయర్ టోర్నీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Women's World Cup 2021 Qualifiers: మహిళల ప్రపంచకప్-2022లో పాల్గొనబోయే మూడు జట్ల కోసం ఈ క్వాలిఫయర్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీని రద్దు చేయడం వల్ల ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్‌లను మెగాటోర్నీలో పాల్గొనబోయే క్వాలిఫయర్ జట్లుగా నిర్ణయించింది ఐసీసీ.
"ఈ క్వాలిఫయర్ టోర్నీని జరిపేందుకు చాలా విధాలుగా ప్రణాలికలు రూపొందించినా.. అది సాధ్యం కావడం లేదు. జింబాబ్వే నుంచి ఈ జట్లను వీలైనంత త్వరగా వారి దేశాలకు చేరుస్తాం. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్ వచ్చే ఏడాది జరగబోయే మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి" అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
వచ్చే ఏడాది మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు మహిళల ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీకి ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ (ఆతిథ్య హోదాలో) అర్హత సాధించగా.. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఈ జట్లతో కలిశాయి.