పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు మాలిక్. ఇప్పుడే రిటైర్ అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తానింకా ఫిట్‌గా ఉన్నానని బ్యాటింగ్, బౌలింగ్ చేయగలనని తెలిపాడు.
"నేను ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. నాకు ఇప్పుడే రిటైర్ అయ్యే ఆలోచన లేదు. ప్రస్తుతం నేను ఫిట్‌గా ఉన్నా. నాలో ఇంకా బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ఇప్పటికే రెండేళ్ల పాటు కొన్ని లీగ్‌ల్లో ఆడేందుకు అంగీకారం తెలిపాను. హాట్‌స్పాట్స్‌లో ఫీల్డింగ్ చేయగలను. రెండు పరుగులు తీయగలను, కాపాడగలను. నా ఫిట్నెస్ టాప్‌లో ఉంది."
-మాలిక్, పాక్ క్రికెటర్
మాలిక్ ఇప్పటికే టెస్టు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం టీ20లకు మాత్రమే ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు పాకిస్థాన్ తరఫున 116 టీ20లు ఆడిన ఇతడు 2,335 పరుగులు సాధించాడు. 28 వికెట్లూ దక్కించుకున్నాడు. అలాగే పొట్టి ఫార్మాట్లో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు ఈ ఫార్మాట్లో 10,488 పరుగుల చేయగా గేల్ (13,885), పొలార్డ్ (10,710) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.