టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమీయే ఇప్పుడు క్రికెట్‌లో హాట్ టాపిక్. పలువురు మాజీలు అతడికి మద్దతుగానో.. వ్యతిరేకంగానో వ్యాఖ్యలు చేస్తూ నిత్యం విరాట్‌ను వార్తల్లో ఉంచుతున్నారు. నేటి నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ రెండింటికి కోహ్లీని పక్కనపెట్టడంపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. విండీస్ సిరీస్ నుంచి కోహ్లీని తొలగించారా.. లేదా విశ్రాంతినిచ్చారా అనే విషయంపై స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో విరాట్‌కు అండగా నిలిచాడు మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్. విరాట్ కోహ్లీకి విండీస్‌తో సిరీస్‌కు జట్టులో స్థానం కల్పించకపోవడం తప్పుడు సంకేతమేనని విమర్శించారు. 'విండీస్‌తో సిరీస్‌కు కోహ్లీకి ఎందుకు విశ్రాంతి ఇచ్చారో నాకర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్ జట్టు ప్రణాళికలో విరాట్ ఉంటే.. అప్పటి వరకు ఎక్కవ మ్యాచ్‌లు ఆడాలి. ఫామ్‌తో పాటు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలంటే మైదానంలోనే గడపాలి. అదే అతడికి ప్రయోజనకరం. విశ్రాంతినిచ్చి పక్కన కూర్చోబెడితే మాత్రం తప్పుడు సంకేతాలు పంపినట్లే. ఎవరైనా సరే భారీగా పరుగులు చేయలేని సందర్భాల్లోనూ ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనేది నా అభిప్రాయం. జట్టుతో ప్రయాణం చేస్తూనే ఉండాలి. అప్పుడే పరుగులు చేయగలిగే అవకాశం ఉంటుంది. అతడిపై అతడికి నమ్మకం వచ్చేందుకే ఇలా చేయాలి' అని వెంగ్‌సర్కార్ సూచించాడు. జులై 22 నుంచి మూడు వన్డేల సిరీస్, జులై 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: అతడు తొలి వన్డేకు డౌటే.. ఆందోళనలో ఫ్యాన్స్!