తన కెరీర్లో ఇప్పటి వరకు తీసిన అతిపెద్ద వికెట్ విరాట్ కోహ్లీదేనని ఇంగ్లాండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ అంటున్నాడు. విరాట్‌ను పెవిలియన్ పంపించేందుకు నాలుగు లేదా ఐదో స్టంప్‌లైన్‌లో బంతులు వేశామని పేర్కొన్నాడు. తాము కట్టుదిట్టంగా బంతులు వేసినా టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఆడారని వెల్లడించాడు. రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
"ఇప్పటివరకు నేను తీసిన గొప్ప వికెట్ విరాట్ కోహ్లీదే. అందుకు సంతోషంగా ఉంది. ఇదో గొప్ప సందర్భం. నాలుగు-ఐదో స్టంప్‌లైన్‌లో సరైన లెంగ్త్‌లో బంతి విసరాలన్నదే మా ప్రణాళిక. అదృష్టవశాత్తు అది పనిచేసింది."
- ఓలీ రాబిన్సన్, ఇంగ్లాండ్ బౌలర్
ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో రాబిన్సన్ ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇక లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి తీసుకోగానే విరాట్ కోహ్లీ (42)ని ఔట్ చేశాడు. ఇతడి బౌలింగ్‌లో స్లిప్‌లో జోరూట్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు కోహ్లీ.
తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 83 పరుగులకు ఔటవ్వగా కేఎల్ రాహుల్ 127*తో అజేయంగా నిలిచాడు. ఉదయం చినుకులు పడటం, ఆకాశం మేఘావృతమవ్వడం వల్ల జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. స్వింగ్‌కు టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతుందని భావించగా అలా జరగలేదు. ఇంగ్లాండే దెబ్బతింది.
"మేం 10-15 అవకాశాలు చేజార్చుకున్నాం. త్వరగానే 2-3 వికెట్లు పడగొట్టాల్సింది. పరిస్థితులు, వాతావరణం చూసి త్వరగానే మాకు వికెట్లు లభిస్తాయని అనుకున్నాం. రెండో రోజైనా అలా జరగాలని కోరుకుంటున్నా. మేం బాగానే బౌలింగ్ చేశాం. ఏదేమైనా టీమ్‌ఇండియా బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. బ్యాటు అంచులకు తగిలేలా ఆడలేదు. మా స్వింగ్ కూడా అత్యుత్తమంగా లేదు. మేం వుబుల్ సీమ్‌కు ప్రయత్నించినా వికెట్ నెమ్మదిగా ఉండటం వల్ల పాచిక పారలేదు. జిమ్మీతో కొత్త బంతి పంచుకోవడం ఆనందంగా ఉంది" అని రాబిన్సన్ తెలిపాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా 'టెస్టు త్రయం' గాడి తప్పుతోందా?