Heinrich Klaasen Retirement : దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. టెస్ట్‌ల నుంచి తప్పుకునే విషయమై ఆలోచిస్తూ పలు నిద్ర లేని రాత్రులు గడిపానని చెప్పాడు.
తన నిర్ణయం సరైందా కాదా అని చాలా మదన పడ్డానని, అంతిమంగా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్ ఓ ప్టేట్‌మెంట్ ద్వారా వెల్లడించాడు. మొత్తానికి తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు.
32 ఏళ్ల క్లాసెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగైన రికార్డునే కలిగి ఉన్నాడు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 46 సగటుతో పరుగులు చేశాడు. అయితే దక్షిణాఫ్రికా తరపున ఇప్పటివరకు కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. 2019లో భారత్ పర్యటనలో క్లాసెన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రాంచీ వేదికగా జరిగిన ఆ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేశాడు. ఆ తర్వాత మరో టెస్టు ఆడడానికి నాలుగేళ్ల పాటు ఎదురుచూశాడు.
2023లో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే క్లాసెన్ విఫలమయ్యాడు. మొత్తంగా టెస్టుల్లో 105 పరుగులు మాత్రమే చేశాడు. అత్యుత్తమ స్కోరు 35 మాత్రమే. దీంతో వికెట్ కీపర్‌గా టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. కైల్ వెర్రెయిన్ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
వైట్ బాల్ క్రికెట్‌లో హెన్రిచ్ క్లాసెన్ చాలా డేంజరస్ బ్యాటర్. 2023లో బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. టీ20ల్లో 172, వన్డేల్లో 140 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో క్లాసెన్ దక్షిణాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు.
అయితే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం టెస్టు ఫార్మాట్‌ను విస్మరించిందని సౌతాఫ్రికా విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో క్లాసెన్ రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టెస్టులకు ఆదరణ తగ్గి వైట్ బాల్ క్రికెట్‌కు ప్రాధాన్యత పెరగడంతో క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే సందేహాలు వస్తున్నాయి.