Hasin Jahan Allegations On Shami : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై అతడి భార్య హసీన్ జహాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. షమీది డర్టీ మైండ్ అని.. అతడు చేసిన తప్పులకు దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హసీన్ జహాన్ తనకు తన జీవితంలో ఎదురైన కష్టాలను 'ఈటీవీ భారత్'తో షేర్ చేసుకున్నారు. మూడో తరగతి చదువుతున్న తన కుమార్తెకు, ఆమె తండ్రి మ్యాచ్‌పై ఎలాంటి ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాను షమీతో విడాకుల కేసుతో బిజీగా ఉన్నానని.. తన కుమార్తెను ఒంటరిగానే పెంచుతున్నానని హసీన్ తెలిపారు.
(షమీపై) వివిధ కేసులు సుప్రీం కోర్టు, అలహాబాద్ హైకోర్టు, దిగువ కోర్టుల్లో నడుస్తున్నాయని.. ఆ కేసులన్నింటినీ తాను ఒంటరిగానే పరిష్కరించాలి అని హసీన్ చెప్పారు. 'నా తల్లిదండ్రులు (కోల్‌కతాకు) 250 కిలోమీటర్ల దూరంలో బీర్‌భమ్‌లో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు. నా తమ్ముడు కోవిడ్‌తో మరణించాడు. నాకు అండగా నిలబడటానికి ఎవరు ఉన్నారు? ఇది నా పోరాటం నేను ఒంటరిగా పోరాడుతున్నాను' అని హసీన్ జహాన్ తన బాధను వ్యక్తం చేశారు.
నేను ఫైనల్ మ్యాచ్ చూడలేదు : హసీనా జహాన్
వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత హసీన్ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఆ విడియో షమీని టార్గెట్ చేస్తూ హసీన్ పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీనిపై 'ఈటీవీ భారత్' హసీన్‌ను వివరణ కోరింది. ఆమె ఈ విధంగా బదులిచ్చారు.
"నేను ప్రపంచ కప్ ఫైనల్‌ను చూడలేదు. నాకు మ్యాచ్‌పై ఆసక్తి లేదు. నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే, నా వాదన విన్న తర్వాత కూడా నన్నే విలన్‌గా చూస్తున్నారు. కొంత మంది వికృత మనస్తత్వం ఉన్న వారు నన్ను విలన్‌గా మార్చారు. ఒక వర్గం మీడియా షమీకి అనుకూలంగా పనిచేస్తోందని చెప్పవలసి వస్తోంది. షమీకి 'సెలెబ్ (సెలెబ్రిటీ)' ట్యాగ్ ఉంది కాబట్టి అతడు నిర్దోషి. అప్పుడు నేనే విలన్ అవుతాను. బాధకలిగించే విషయం ఏంటంటే.. టీఆర్‌పీల కోసం నన్ను విలన్‌గా చేశారు. షమీ పవర్‌ఫుల్ కాబట్టే అతనికి భారత మీడియా మద్దతు ఉంది" అని జహాన్ సంచలన ఆరోపణలు గుప్పించారు.
'నేను అతడికి లొంగను!'
"అతడు (షమీ) ఎంత డిర్టీ మైండ్ ఉన్నవాడో నాకు తెలుసు. నేను అతడి ఉచ్చులో పడను. అతడికి కోర్టు నుంచి ఒత్తిడి లేకపోతే అతడు తన (చెడు) మార్గాలను ఎప్పటికీ సరిదిద్దుకోలేడు. తనను తాను సరిదిద్దుకోవడానికి అతడికి దేవుడి శిక్ష అవసరం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చేసిన తప్పులకు అనుభవించక తప్పుదు. అతడు చేసిన తప్పులకు కూడా శిక్ష పడుతుంది. ఆ రోజు కోసం నేను వేచి చూస్తాను" అని హసీనా తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక షమీ 2014లో హసీన్ జహాన్‌ను వివాహం చేసుకోగా.. వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
మహిళల ప్రీమియర్ లీగ్‌కు బీసీసీఐ సన్నాహాలు- WPL 2024 వేలం అప్పుడే!
ఔట్ ఇచ్చారని టీమ్ వాకౌట్- సగం మ్యాచ్‌లో విజేతగా మరో జట్టు- అసలేం జరిగిందంటే?