భారత క్రికెట్లో మాజీలతో పాటు ప్రస్తుత తరంలోనూ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆల్ టైమ్ టెస్టు ఎలెవన్ జట్టును (India All Time Test Eleven) ఎంపిక చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ, జులై 19న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే (Harsha Bhogle) ఆ పని చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇద్దరికీ మాత్రమే తన జట్టులో చోటు కల్పించాడు.
టెస్టుల్లో పది వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడైన గావస్కర్‌తో పాటు డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓపెనర్లుగా చోటు కల్పించాడు. 80వ దశకంలో విధ్వంసకర బౌలర్లను ఎదుర్కొన్న గావస్కర్, తన దూకుడైన బ్యాటింగ్‌తో బౌలర్లను ఊచకోత కోసే వీరూకు ఓటేశాడు భోగ్లే.
'ది వాల్'గా భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాహుల్ ద్రవిడ్, టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు సహా ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్‌ను వరుసగా 3,4 స్థానాల్లో ఎంపిక చేశాడు.
గంగూలీ, లక్ష్మణ్‌కు నో ప్లేస్..
టెస్టుల్లో బ్యాటింగ్ దిగ్గజాలుగా పేరుపొందిన గంగూలీ, లక్ష్మణ్, అజారుద్దీన్‌కు.. జట్టులో స్థానం ఇవ్వలేదు హర్ష. ఐదో స్థానం కోసం ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. ఇక వికెట్ కీపర్‌గా ధోనీని ఖరారు చేశాడు. ఆల్‌రౌండర్ జాబితాలో కపిల్ దేవ్‌కు చోటు ఇచ్చాడు. స్పిన్ ద్వయంగా అనిల్ కుంబ్లేతో పాటు రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో నిలిచారు. ఈ విభాగంలో హర్భజన్‌ను పక్కన పెట్టాడు భోగ్లే. ఇక ఫాస్ట్ బౌలర్ల జాబితాలో జవగళ్ శ్రీనాథ్‌తో పాటు జహీర్‌ను ఎంపిక చేశాడు.
భారత ఆల్‌టైమ్ టెస్టు ఎలెవన్..
సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్.. కళ్లన్నీ మయాంక్‌పైనే