Dhoni hardik pandya: టీమ్ఇండియా మాజీ సారథి ధోనీపై ప్రశంసలు కురిపించాడు హార్దిక్ పాండ్యా. తన అంతర్జాతీయ అరంగేట్ర రోజుల్లో మహీ ఎంతో మద్దతుగా నిలిచాడని అన్నాడు. "నేను జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ధోనీ, కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తొలి మ్యాచ్‌లో కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాను. కానీ మహీ భాయ్ నాపై నమ్మకంతో మరో రెండు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో వేసిన మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాను. ఇక ఆ సిరీస్ ముగిసిన తర్వాత ప్రపంచకప్ జట్టులో ఉంటావంటూ ధోనీ చెప్పాడు. దాంతో నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే అప్పటికీ ఆది నా మూడో అంతర్జాతీయ మ్యాచ్. చివరగా మహీ కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా" అని పాండ్యా పేర్కొన్నాడు. కాగా, జూన్ 9న ప్రారంభంకాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం హార్దిక్ సన్నద్ధమవుతున్నాడు.
Dhoni pretorius: మరోవైపు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ కూడా.. ధోనీని ప్రశంసించాడు. మహీ ఏదైనా చేయగలననే నమ్మకంతో ఉంటాడని అన్నాడు. మహీ నుంచి పలు విషయాలు నేర్చుకోవాలని ఉందన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్‌లో చెన్నై తరఫున ఆడిన ప్రిటోరియస్.. పలు సందర్భాల్లో ధోనీతో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఎలాంటి స్థితిలోనైనా ధోనీ ప్రశాంతంగా ఉంటాడు. దేనికీ అతిగా స్పందించడు. అతనెంతో ఆశావహ దృక్పథంతో ఉంటాడు. ఏదైనా చేయగలనని నమ్ముతాడు. ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ గెలుస్తామనే ధీమాతో ఉంటాడు. అవన్నీ నేను అతడి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా. అలాగే ఛేదనలో మ్యాచ్ ఆఖరి క్షణాల్లో బ్యాటర్లు ఒత్తిడిలో ఉండరని, అప్పుడు బౌలర్లే తీవ్ర ఒత్తిడికి గురవుతారనే విషయాన్ని నాకు తెలియజేశాడు. ఒక బౌలర్ ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోనూ మ్యాచ్ ఓడిపోతారని, అదే బ్యాట్స్‌మన్‌గా అలాంటి స్థితిలో గెలవచ్చని అతడు అర్థమయ్యేలా చేశాడు" అని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: ఆయనే నా స్ఫూర్తి.. అందుకే వికెట్‌కీపర్ అయ్యా: పంత్