ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఓటమి నుంచి గట్టెక్కామని టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య తెలిపాడు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని కొనియాడాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్య.. టీమ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని తెలిపాడు. 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు.
"మేం బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఒత్తిడికి గురయ్యాం. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి గేమ్‌లో నిలిచేందుకు మార్గాలను కనుగొన్నాం. టీమ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. ఎన్నో అవకాశాలను సృష్టించుకొని రెండు చేతులా అందిపుచ్చుకున్నాం. ముఖ్యంగా మా ఫీల్డింగ్ అద్భుతం. జడేజా, శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌లు అందుకున్నారు. ముఖ్యంగా లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా పట్టిన తీరు అమోఘం. 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జడేజా వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనంలో తొలి మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. కేఎల్ రాహుల్‌కు ఒకరు అండగా నిలవాలని అనుకుంటున్న తరుణంలో జడేజా నిలబడ్డాడు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. నా బౌలింగ్, బ్యాటింగ్‌ను బాగా ఆస్వాదించాను. కేఎల్ రాహుల్, జడ్డూ మ్యాచ్ పూర్తి చేసిన విధానం, ప్రతికూల పరిస్థితుల్లో వారు చేసిన బ్యాటింగ్ టీమ్ ఆత్మవిశ్వాసాన్నిపెంపొందించింది. వారు బ్యాటింగ్ చేస్తుంటే ప్రశాంతంగా ఆటను చూశాం. ఇదో అద్భుతమైన విజయం" అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమ్ఇండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(91 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 75 నాటౌట్), రవీంద్ర జడేజా(69 బంతుల్లో 5 ఫోర్లతో 45 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో రాణించారు. అయితే లక్ష్యచేధనలో టీమ్ఇండియా 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 6వ వికెట్‌కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి ఓటమిని తప్పించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.