Harbhajan on Kohli Century: కేప్‌టౌన్ వేదికగా మరికాసేపట్లో దక్షిణాఫ్రికాతో మొదలయ్యే మూడో టెస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ రాణిస్తాడని.. చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న శతకం కూడా సాధిస్తాడని మాజీ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్లకు పైగా ఒక్క శతకం కూడా బాదలేని కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మునుపటిలా రాణిస్తాడన్నాడు.
అలాగే రెండో టెస్టులో అర్ధశతకాలతో రాణించిన సీనియర్ బ్యాటర్లు అజింక్యా రహానె, ఛెతేశ్వర్ పుజారా కూడా ఈ మ్యాచ్‌లో బాగా ఆడతారని హర్భజన్ అన్నాడు. హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మారుస్తారని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు వాళ్లిద్దరి ఎంపికపై నెలకొన్న సందేహాలు కాస్త తగ్గాయని చెప్పాడు. ఇలాంటి సీనియర్ ఆటగాళ్లు రాణించడం టీమ్‌ఇండియాకు శుభపరిణామమన్నాడు.
వెన్నునొప్పి కారణంగా కోహ్లీ రెండో టెస్టుకు దూరమవ్వగా.. ఇప్పుడు తిరిగి కోలుకొని మూడో టెస్టుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే మళ్లీ జట్టు పగ్గాలు అందుకొని ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు.