Gautam Gambhir Vs Virat Kohli IPL 2023 : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో ఉంటాడు. ఇటీవల భారత మాజీ ప్లేయర్ శ్రీశాంత్‌తో వివాదంతో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే గతేడాది ఐపీఎల్లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ గురించి గంభీర్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్ ఈ ఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్వ్యూలో 'విరాట్ - నవీన్ ఉల్ హక్ వివాదం, అసలు ఆ రోజు ఏమైంది?' అని అడిగిన ప్రశ్నకు గంభీర్ స్పందించాడు. 'మెంటార్‌గా నా టీమ్ ప్లేయర్లకు ఎప్పుడూ అండగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్నే నేను నమ్ముతాను. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. ఒక్కసారి మ్యాచ్ ముగిసిన తర్వాత నా జట్టు ప్లేయర్లతో ఎవరైనా వాగ్వాదం చేస్తున్నారని అనిపిస్తే వెళ్లి అడ్డుకోవడం నా ముందున్న బాధ్యత. అటువైపు ఎంతటివారున్నా సరే, అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్లేయర్లను కాపాడాల్సిన హక్కు కూడా నాకు ఉంది' అని గంభీర్ సమాధానమిచ్చాడు.
'మన్మోహన్ సింగ్‌ను కూడా తప్పుపడతారా!'
విరాట్- నవీన్ ఉల్ హక్ విషయంతో పాటు మరో అంశంపై కూడా గంభీర్ మాట్లాడాడు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాడిన భాషను గంభీర్ తప్పుబట్టాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌కు మోదీ వెళ్లడం వల్లనే భారత్ ఓడిపోయిందనే అర్థంలో రాహుల్ వ్యాఖ్యలు చేశాడు. వాటిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. ''రాహుల్ గాంధీ అలాంటి పదాలను వాడకుండా ఉంటే బాగుండేది. దేశ ప్రధాని పట్ల ఇలా మాట్లాడటం దారుణం. 2011 ప్రపంచ కప్ సెమీస్‌కు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చారు. ఒకవేళ భారత్ అప్పుడు ఓడిపోయి ఉండే, ఆటగాళ్లను కలవడానికి ఆయన వెళ్తే దాన్ని కూడా తప్పుబడతారా?'' అని గంభీర్ వ్యాఖ్యలు చేశాడు. ఇక 2011 ప్రపంచ కప్‌ను ధోనీ నేతృత్వంలో టీమ్‌ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
'20 కేజీలు తగ్గితే ఐపీఎల్లో తీసుకుంటా' - అఫ్గాన్ ప్లేయర్‌పై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
WPL 2024 కప్పు మాదే!- అభిమానుల ఆనందమే మా లక్ష్యం : RCB కెప్టెన్ స్మృతి మంధాన