క్రికెటర్ జీవితం అంటే కావాల్సినన్ని డబ్బులు, విలాసవంతమైన కార్లు, పెద్ద ఇల్లు.. ఇలా చాలా ఉంటాయి. అలాంటిది, ఓ మాజీ క్రికెటర్ ఇల్లు గడవడానికి ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడంటే నమ్మగలరా! కానీ, ఇది నిజం.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2005 సమయంలో పాక్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న అర్షద్.. రిటైర్మెంట్ తర్వాత కారు డ్రైవర్‌గా మారాడు. ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా యూజర్ స్వయంగా వెల్లడించాడు.
"అర్షద్ ఖాన్.. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని పూర్తి చిరునామా అడగ్గా.. పాకిస్థాన్ నుంచి వచ్చానని, ఇక్కడ సిడ్నీలో నివసిస్తున్నానని తెలిపాడు. లాహోర్ బాద్షా జట్టు తరఫున ఐసీఎల్ టోర్నీ ఆడటానికి చాలా సార్లు హైదరాబాద్ వచ్చినట్లు వెల్లడించాడు. అతని పూర్తి పేరు విని ఆశ్చర్యపోవడం నా వంతైంది. అతన్ని గుర్తు పట్టాను" అని ఆ సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నాడు.
1997-98లో పాకిస్థాన్ తరఫున విండీస్ జట్టుపై అరంగేట్రం చేశాడు అర్షద్ ఖాన్. 9 టెస్టులతో పాటు 58 వన్డేలు ఆడాడు. 2006 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. 2001 వరకు జట్టులో కీ ప్లేయర్‌గా కొనసాగాడు. 2005 భారత పర్యటనకు వచ్చిన పాక్ టీమ్‌లో అర్షద్ సభ్యుడు. ఈ టూర్లో సచిన్‌తో పాటు సెహ్వాగ్ వికెట్‌ను పడగొట్టడం విశేషం. చివరగా టెస్టులతో పాటు వన్డే మ్యాచ్‌లను భారత్‌పైనే ఆడాడు అర్షద్.
ఇదీ చదవండి: ప్రపంచ కప్ గెలిచిన క్రికెటర్... ఇప్పుడు కార్పెంటర్!