కరోనా ధాటికి మరో క్రీడాకారుడు కన్నుమూశారు. బీసీసీఐ మాజీ రిఫరీ, సౌరాష్ట్ర క్రికెటర్ రాజేంద్ర సిన్హ్ జడేజా కొవిడ్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది.
"సౌరాష్ట్ర క్రికెటర్లలో ఒకరైన రాజేంద్ర సిన్హ్ జడేజా కొవిడ్‌తో కన్నుమూశారు. పాత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న జడేజా లేని లోటు తీరనిది. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాం" అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
జడేజా మృతి పట్ల బీసీసీఐ, సౌరాష్ట్ర మాజీ కార్యదర్శి నిరంజన్ షా సంతాపం ప్రకటించారు. "మంచి క్రికెట్ నైపుణ్యాలున్న ఆటగాడు జడేజా. ఆట పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని పేర్కొన్నారు.
"జడేజా మృతి క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు. నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్లలో రాజేంద్ర సార్ ఒకరు. ఆయన కోచ్‌గా ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నా" అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైదేవ్ షా పేర్కొన్నారు.
పాత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్ జడేజా. 50 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 134 వికెట్లతో పాటు 1536 రన్స్ సాధించారు. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 104 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టారు. బీసీసీఐ అధికారిక రిఫరీగా పనిచేశారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో కోచ్, టీమ్ మేనేజర్, సెలెక్టర్‌గా పనిచేశారు.
ఇదీ చదవండి: ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్ ఆడింది అతడే!